ఏపీ చీఫ్ సెక్రటరీగా విజయానంద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాయిప్రసాద్, విజయానంద్ అనే అధికారుల మధ్య పోటీ ఏర్పడితే.. సాయి ప్రసాద్ కు ఇంకా సర్వీస్ ఉంటుంది కాబట్టి విజయానంద్ రిటైరైన తర్వాత అవకాశం కల్పించాలని నిర్ణయించి ఆయనకు పదవి ఇచ్చారు. ఓ ఐఏఎస్‌కు తన సర్వీసులో చీఫ్ సెక్రటరీ కావడం అనేది ఓ కల. రాజకీయాల్లో ముఖ్యమంత్రి టాప్ అయితే.. అధికారవర్గాల్లో ఆ స్థాయి సీఎస్‌ది.
విజయానంద్ ను చీఫ్ సెక్రటరీగా నియమించడంతోనే ఆయన కులాన్ని తెరపైకి తెచ్చిన కొంత మంది కూటమి నేతలు తాము బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఆయన బీసీ కావడం నిజమే కానీ ఆ కారణంగానే ఆయనను సీఎస్‌గా నియమించామని చెప్పడం మాత్రం ఆయన సర్వీస్‌ను, సీనియార్టీని అగౌరవపర్చినట్లే అవుతుంది. విజయానంద్ ఇప్పటి వరకూ ఏ కులం అని ఎప్పుడూ ఎవరూ చూడలేదు . ఎందుకంటే అధికారులకు రాజకీయాలకు సంబంధం లేదు.కానీ ఇప్పుడు ప్రాధాన్యం ఇచ్చే అధికారులు కులాల్ని కూడా అనుకూలంగా చేసి ప్రచారం చేసుకునే పరిస్థితి వచ్చింది.
జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చేసిన నిర్వాకాల వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డిని పెట్టుకున్నారు. ఆయన సినియార్టీ కోటాలో పదకొండో స్థానంలోఉండేవారు. ఆయనను తెచ్చి పెట్టుకోవడం వల్ల మిగతా పది మంది సీఎస్ వరకూ రాకుండానే రిటైరయ్యారు. డీజీపీ విషయంలోనూ అంతే. సినియార్టీలో కంటికి కనిపించని రాజేంద్రనాథ్ రెడ్డిని మనోడన్న కారణంగా తెచ్చి సీట్లో కూర్చోబెట్టారు. ఈ కారణంగా చాలా మంది సీనియర్లు డీజీపీ హోదాకు రాకుండానే రిటైరయ్యారు. కానీ ఇప్పుడు చంద్రబాబు సినియారిటీని గౌరవిస్తున్నారు. జగన్ రెడ్డి హయాంలో వారు ఎన్ని నిర్వాకాలు చేసినా క్షమిస్తున్నారు.