ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా ఎవరూ ఊహించని నేతను.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా ఖరారు చేశారు. ఆయన పేరు.. తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ వినిపించలేదు. జాతీయ రాజకీయాల్లోనూ.. అంత గొప్ప పేరు కాదు. కానీ.. పొరుగు రాష్ట్రం ఒడిషాలో మాత్రం.. ప్రముఖ నేతగా గుర్తింపు పొందారు. ఆయన పేరు బిస్వ భూషణ్ హరిచందన్. ఒడిషాకు చెందిన ఆయన తన జీవిత కాలం మొత్తం ఆరెస్సెస్, బీజేపీలతో కలసి పయనించారు. 85 ఏళ్ల బిస్వ భూషణ్ హరిచందన్ పేరును అసలు ఏపీ గవర్నర్ పోస్టుకు పరిశీలిస్తున్నట్లుగా కూడా మీడియాకు సమాచారం లేదు. హఠాత్తుగా.. రాష్ట్రపతి ఏపీ నూతన గవర్నర్‌గా బిస్వ భూషణ్ హరిచందన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిస్వ భూషణ్‌తో సుదీర్ఘకాలంగా సంఘ్‌పరివార్‌తో అనుబంధం ఉంది.
1988 నుంచి బీజేపీలో బిశ్వభూషణ్ క్రియాశీలంగా ఉన్నారు. ఒడిషా బీజేపీకి రెండు సార్లు అధ్యక్షునిగా పోటీ చేశారు. అనూహ్యంగా.. ఆయన పేరును.. బీజేపీ పెద్దలు తెరపైకి తీసుకు వచ్చారు. అంతకు ముందు సుష్మాస్వరాజ్ , కిరణ్ బేడీ సహా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఉత్తరాది నేతల కన్నా.. ఏపీ పొరుగు రాష్ట్రాల నేతలకు ప్రాధాన్యం ఇస్తే మంచిదని.. మోడీ, షా భావించినట్లు తెలుస్తోంది. ఇంత కాలం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న నరసింహన్.. ఇప్పుడు తెంలగాణ గవర్నర్ గా మాత్రమే ఉంటారు. అయితే.. ఆయనను కూడా తప్పించి.. తెలగాణకు కూడా కొత్త గవర్నర్ ను నియమిస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా ఓ గవర్నర్ ను నియమించడం ఇదే తొలి సారి.
విభజన సమయంలో ఉన్న గవర్నర్ నే.. ఆ తర్వాత ఉమ్మడి గవర్నర్ గా కొనసాగించారు. ఇప్పుడు… బీజేపీకి సంఘ్ పరివార్ కు జీవితాంతం సేవ చేసిన బిశ్వభూషణ్‌కు చాన్సిచ్చారు. బిశ్వభూషణ్ నియామకంపై.. ఏపీ సర్కార్‌కు కూడా సమాచారం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త గవర్నర్ ను నియమిస్తారని.. ఆయన కోసం.. ఓ రాజ్ భవన్ లాంటి ఇల్లు సిద్ధం చేయాలన్న సమాచారం మాత్రం వచ్చిందంటున్నారు. అందుకే ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ఉపయోగించుకున్న విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్ ను అందుకు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఏపీకి కొత్త గవర్నర్ గా ఎవరూ ఊహించని నేతను.. బీజేపీ పెద్దలు నియమించారు.