ఓ రాష్ట్ర అభివృద్ధిని దేనితో లెక్కిస్తారు..? జీడీపీ పెరిగితేనే.. ఆదాయం పెరిగినట్లు అవుతుంది. జీడీపీ పెరగాలంటే… అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి.. ప్రజల ఆదాయం పెరిగేలా చేయాలి. అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టకపోతే.. రాష్ట్రం అధోగతి పాలయినట్లే. ఏ ప్రభుత్వమైన రెండు రకాల ఖర్చులను బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఒకటి అభివృద్ధి… మరొకటి సంక్షేమం . సంక్షేమం అనేది ప్రజలకు నేరుగా లబ్దిచేకూరుస్తుంది. అభివృద్ధి.. ఆదాయాన్ని పెంచుతుంది. ఉదాహరణకు..ఓ ప్రాజెక్ట్ మీద.. ప్రభుత్వం… రూ. పదివేల కోట్లు ఖర్చు పెడుతుందనుకుందాం. ఆ ప్రాజెక్ట్ వల్ల పదివేల ఎకరాలు సాగులోకి వస్తే.. ఆ మేరకు ప్రజలకు ఆదాయం పెరుగుతుంది. అంటే… రాష్ట్ర ఆదాయం పెరిగినట్లే. అదే జీడీపీ.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ జీడీపీని పెంచుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గత ఎనిమిది నెలల కాలంలో … అభివృద్ధి కార్యక్రమాలపై పెట్టిన ఖర్చు రూ. నాలుగు వేల కోట్లకు అటూ ఇటూగానే ఉంది. ఇది బడ్జెట్లో .. రెండు, మూడు శాతం కూడా లేదు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన అన్ని రకాల పనులను.. ఎనిమిది నెలల కిందట నిలిపివేశారు. చివరికి పోలవరం ప్రాజెక్ట్ పనులు కూడా నిలిపివేశారు. ఇప్పుడు చాలా మందకొడిగా పనులు జరుగుతున్నాయి. ఓ హౌసింగ్ ప్రాజెక్టులో జరుగుతున్నట్లుగా కూడా జరగడం లేదు. ఇతర ప్రాజెక్టులు… ఇళ్ల నిర్మాణం అన్నీ నిలిచిపోయాయి. అన్నింటికీ రివర్స్ టెండర్లేశారు. కానీ ఎవరూ పనులు ప్రారంభించ లేదు.
నిజానికి ప్రభుత్వం చేసే ఖర్చుతోనే..ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ కదలిక ఉంటుంది. ఎంత ఎక్కువ ప్రభుత్వం పనులు చేపడితే.. అంతగా.. నగదు చెలామణి ఉంటుంది. ఎనిమిది నెలల కిందట.. పోలవరం, అమరావతి ప్రాంతాల్లో మాత్రమే కాదు.. ఏపీ వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు, ఇతర ప్రాజెక్టులు శరవేగంగా నిర్మితమయ్యేవి. ఓ అంచనా ప్రకారం… ఇలా పెట్టే ఖర్చులో 20 శాతానికిపైగా వివిధ పన్నుల రూపంలో మళ్లీ ప్రభుత్వానికే చేరుతుంది. ఇప్పుడు అన్నీ ఆగిపోవడంతో… ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది. ప్రజలకూ మేలు జరగడంలేదు. జీడీపీ కూడా పడిపోయింది. మొత్తానికి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితికి వచ్చింది.