ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమంపై తీసుకుంటున్న శ్రద్ధ సత్ఫలితాలను ఇస్తోంది. పట్టణ పేదల విషయంలో దేశంలో ఇతర ప్రభుత్వాల కన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేర్ తీసుకుంటోంది. వారి సంక్షేమం కోసం అమితంగా ఖర్చు చేస్తోంది. దీంతో పట్టణ పేదల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ఈ విషయంలో ఏపీ నెంబర్‌వన్‌గా నిలిచింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారికంగా ధృవీకరించింది. పట్టణ పేదల జీవన ప్రమాణాలు మెరుగు పరిచే విషయంలో ఏ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నదానిపై ర్యాంకులు ఇచ్చేందుకు సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైం పేరుతో వ్యవస్థను ఏర్పాటు చేసింది. వివిధ ప్రమాణాలు పాటించి ఆ మేరకు ర్యాంకులు ఇస్తోంది.
తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ పట్టణాల్లో 24 లక్షల మంది పేద మహిళలను సంఘటితం చేసిన రాష్ట్ర పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 2.4 లక్షల పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది. ఉపాధి కల్పన పథకాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రశంసించింది. రూ. 12కోట్ల పారితోషికం కూడా ఇవ్వనుంది. ఏపీ సర్కార్.. ఈ మొత్తాన్ని పొదుపు సంఘాల కోసం వెచ్చించనుంది.
పొదుపు సంఘాల కోసం.. రుణమాఫీని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. అలాగే వివిధ పథకాల కింద ఇస్తున్న నగదుతో వారు స్వయం ఉపాధి పొందేలా ఏర్పాట్లు చేశారు. వివిధ మల్టీ నేషనల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా… ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ కృషి అంతా ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.