తెలంగాణలో ప్రభుత్వం మారదని..తము ఏం చేసినా చెల్లుతుందనుకున్న కొంత మంది పోలీసు అధికారులు చేసిన నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉన్నత స్థాయి పదవుల్లో చేసిన పోలీసు అధికారులు జైలు పాలవుతున్నారు. ఖాకీ డ్రెస్, పవర్ ను అడ్డం పెట్టుకుని రాజకీయ లాభాల కోసం రాజకీయ నేతల కోసం అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారు. ఇప్పటికే నలుగురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టయ్యారు. పదుల సంఖ్యలో కింది స్థాయి పోలీసులదీ అదే పరిస్థితి. వందల మంది బిక్కు బిక్కు మంటున్నారు. ఈ పరిస్థితి ఇంతటితో ఆగేది లేదు.
తెలంగాణలో ఇలా ఉంటే.. బహిరంగంగా తప్పు చేసిన ఏపీ అధికారుల పరిస్థితి ఏమిటన్నది విస్తృతంగా చర్చల్లోకి వస్తోంది. వైసీపీకి అనుకూలంగా పని చేశామని … ఇప్పటికే పందొమ్మిది మంది బహిరంగంగా అంగీకరించినట్లుగా ఓ లేఖను ఈసీకి కూడా రాశారు. ఆ లేఖలో సంతకాలు రాసిన ప్రతి ఒక్కరు చేసిన తప్పుడు పనులు.. చేసిన అరెస్టులు.. నేరస్తులకు కొమ్ము కాసిన వైనం చాలా స్పష్టంగా కళ్ల ముందే ఉంది. ప్రైవేటు సెటిల్మెంట్ల గురించి లెక్కే లేదు. వాటి గురించి తవ్వితే ఒక్కరు కూడా బయట పడే అవకాశం లేదు.
ఇక ఐఏఎస్ అధికారుల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఏపీలో పాలన సవ్యంగా సాగిందని ఒక్కరు కూడా చెప్పరు. పరిపాలన అంటే గూడు పుఠాణి అన్నట్లుగా సాగింది. ఐదేళ్ల పాటు జీవోల్ని దాచి పెట్టారు. ఎన్నో తప్పుడు పనులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం మారితే విచారణ కూడా అవసరం లేనంత పక్కాగా ఆధారాలు సైతం రెడీగా ఉన్నాయి. ఈ విషయంలో రాజకీయ నేతలు ఎంత బలి అవుతారన్నది తెలియదు కానీ… దారి తప్పిన అధికారులు .. పోస్టింగుల కోసం తప్పుడు పనులు చేసిన వారు మాత్రం.. జీవితాల్ని నాశనం చేసుకోబోతున్నారన్నది తెలంగాణలో జరుగుతున్న పరిణామాల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.