ఉద్యోగంలో చేరి పదేళ్లు కాని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ.. తక్షణం టెర్మినెట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాన్ఫిడెన్షియల్ అయిన ఈ జీవో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా చిరు ఉద్యోగులే. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, అటెండర్ల ఇలా కింది స్థాయిలో పని చేస్తున్న వారిని తక్షణం తొలగించాలని ఆ ఉత్తర్వుల్లో ఉంది. ఈ జీవోను ఎప్పటి నుండి అమలు చేస్తున్నారో స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు పదేళ్లలోపు సర్వీసు ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. క్షేత్ర స్థాయి నుంచి సమాచారం సేకరించిన ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయనుంది.
డిసెంబర్ 1వ తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రకారం నవంబర్ 28న ప్రభుత్వం నుంచి అందిన మార్గదర్శకాల ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవల్ని నిలిపివేయాలని ఆదేశించారు. ఈ మేరకు వేతన చెల్లింపు విబాగాలు చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ విధానంలో దాదాపు 2.40లక్షల మంది పనిచేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన హామీల మేరకు ఏదొక రోజు తమ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తారనే ఆశతో పనిచేస్తున్న ఉద్యోగులకు పూర్తిగా షాకిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన న్యాయం చేస్తానంటూ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. పదేళ్ల సర్వీసుకు ఒక్క రోజు తక్కువైనా వారి సేవల్ని నిలిపి వేయాల్సి ఉంటుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 90వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ శాఖల్లో చేరారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల కోసం ఏకంగా ఆప్కాస్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.16వేల నుంచి రూ.23వేల లోపు వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వ వచ్చిన తర్వాత వేల మందిని నియమించుకున్నారు. సాక్షి ఉద్యోగుల్ని నియమించారు. మరి వారిని కూడా తీసేస్తారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.