పరిషత్ ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ అంటే… అది ఎలాంటి ఎన్నిక అయినా సరే ఎనభై శాతానికిపైనే నమోదవుతూ ఉంటుంది. అలాంటిది పరిషత్ ఎన్నికల్లో యాభై శాతానికి అటూ ఇటూగానే నమోదయింది. కొన్ని జిల్లాల్లో అరవై శాతం వరకూ నమోదయింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించడం ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇది అన్ని చోట్లా కాదు. చాలా చోట్ల టీడీపీ నేతలు సీరియస్‌గానే బరిలో నిలిచారు. దాంతో చాలా జిల్లాలో వారి వారి ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు తీసుకొచ్చారు. కొన్ని చోట్ల మాత్రం పోలింగ్ కు రావొద్దని ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు.
కారణం ఏదైనా పోలింగ్ శాతంభారీగా తగ్గిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పోలింగ్‌తోనే ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది అభిప్రాయాలు ఓట్ల రూపంలో వెలుగులోకి వస్తున్నాయి. ప్రజా ప్రభుత్వాల ఏర్పాటులో వారే కీలకం. పట్టణ ప్రాంతాల్లో ఎప్పుడూ.. అరవై శాతానికి మించదు. రాజకీయ కారణాల రీత్యా ప్రజలు ఓట్లు వేయడానికి ఆసక్తి చూపించకపోతే..అది ఖచ్చితంగా రాజకీయ పార్టీల వైఫల్యం అవుతుంది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో సందేహాలు ప్రారంభమైతే.. అది ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదం అవుతుంది. ఇలాంటి పరిస్థితిని అధికార, ప్రతిపక్ష పార్టీలు తెచ్చి పెట్టాయి. ఎన్నికల్లో ఏకపక్ష విజయం కోసం అధికార పార్టీ ప్రజల్ని నమ్ముకోవడం కన్నా అధికారాన్ని నమ్ముకుంది.
పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఇష్టవచ్చినట్లుగా చేయాలనుకుంది.ఫలితంగా ప్రతిపక్షం ఎన్నికలను బహిష్కరించాలనుకుంది. అదే సమయంలో… ప్రతిపక్షం బహిష్కరించినా.. పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడి .. బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడినా… ఓటింగ్ శాతం భారీగా పెరగకపోవడం .. ఇబ్బందికరమే. ఈ విషయంపై రాజకీయ పార్టీలు పరిశీలన చేసుకుని ..తమ విధానాల్లో మార్పులు చేసుకోకపోతే.. ఏ వ్యవస్థ మీద వారి ఉనికి ఉందే.. అదే వ్యవస్థను బలహీనం చేసినట్లుగా అవుతుంది.