సమస్య వస్తే తిరగబడటం ఆంధ్రుల నైజం. కష్టం వస్తే పోరాడి సాధించుకోవడం వారి అలవాటు. అన్యాయాన్ని ఎదురొడ్డే ధైర్యం వారి సొంతం. కానీ అది నిన్నామొన్నటి వరుకే . ఇప్పుడు ఆంధ్రుల్లో నిస్సహాయత కనిపిస్తోంది. నోరెత్తలైని దైన్యం కనిపిస్తోంది. రోడ్డెక్కలేని నైరాశ్యం కనిపిస్తోంది. సమస్యలన్నీ చుట్టు ముడుతున్నా.. మనకెందుకులే అని అనుకోవడం కామన్‌గా మారింది. బతుకుపై దెబ్బ పడుతున్నా స్పందించడానికి సిద్ధంగా లేరు. భావితరల భవిష్యత్ కరిగిపోతున్నా భయం భయంగా బతికేస్తున్నారు.
అన్యాయాలపై తిరగబడుతున్న దేశ ప్రజలు..!
వ్యవసాయ బిల్లులు తమను ముంచేస్తాయని పంజాబ్‌లో రైతులు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు..!తమ వర్గానికి ఉద్యోగాల భర్తీ చేపట్టాల్సిందేనని గుజ్జర్లు పట్టాలెక్కిన దృశ్యాలు రాజస్తాన్‌లో కనిపిస్తున్నాయి..! తమిళాన్ని అవమానిస్తున్నారంటూ.. తమిళ ప్రజలు ఏకమైన ఘటనల్నీ చూశాం..! .. అన్నీ మన చుట్టూ జరుగుతున్నా ఆంధ్రుల్లో మాత్రం చలనం లేదు. దేశంలో ప్రతీ చోటా ప్రజలు తమకు అన్యాయం జరిగిదని అనిపిస్తే.. రోడ్డెక్కుతున్నారు. న్యాయం కోసం పోరాడుతున్నారు. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. ఏం జరిగినా ప్రజల్లో స్పందన ఉండటం లేదు. అందరిలోనూ ఓ నిర్వేదం కనిపిస్తోంది. అలా అని వారికి సమస్యలేం లేవా..అంటే.. ఏ మధ్య తరగతి ఇంటి పెద్దను కదిలించినా.. ఇసుక కొరత నుంచి లాక్ డౌన్ కష్టాల వరకూ ఏకరవు పెడతారు. తమ బతుకులు ఎలా శిధిలం అయ్యాయో వివరిస్తారు. అయినా సమస్యలను తీర్చుకోవడానికి పోరుబాట పట్టాలనే ధైర్యం మాత్రం ఎవరూ చేయడం లేదు.
ప్రభుత్వ నిర్వాకాలతో పడిపోయిన ఏపీ ప్రజల జీవన ప్రమాణాలు..!
మధ్య తరగతి ప్రజల ఇంటి కలను చిదిమేసింది ఇసుక. దీనికి ప్రభుత్వ నిర్వాకమే కారణం. ఇప్పటికీ.. ప్రజాభిప్రాయం మేరకే ఇసుక ఇస్తామంటూ ప్రభుత్వం పిల్లిమెగ్గలేస్తోంది. కానీ సమస్య పరిష్కారం కాలేదు. పేదలకు ఉపాధి లేదు. అప్పోసప్పో చేసి ఇల్లు కట్టాలనుకున్నవారికి పునాదుల్లోనే ఆశలు సమాధి అయ్యాయి. ప్రభుత్వ విధానాల కారణంలో ఏపీలో ఆర్థిక వ్యవస్థ మందగించింది. పనులు తగ్గిపోయాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. ఆ సమయంలో కరోనా లాక్ డౌన్ వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రభుత్వం కోటా బియ్యం ఇచ్చి.. కేజీ శెనగలు ఇచ్చి సరిపెట్టింది. ఒకప్పుడు కష్టం చేసుకుని సన్నబియ్యం అన్నం తిన్న ఫ్యామిలీ ఇప్పుడు కోటా బియ్యం తెచ్చుకుని కడుపు నింపుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఉపాధి పొంతుతున్న రంగాలు కేవలం.. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల కుప్పకూలిపోయాయి. రేషన్ డీలర్ల వ్యవస్థకు మంగళం పాడే పరిస్థితి వచ్చింది. ఈ సేవల్లో ఉపాధి పొందుతున్న వారు రోడ్డున పడుతున్నారు. చివరికి కరువు ప్రాంతాల్లో కేంద్రం నిధులతో చేపట్టే ఉపాధి హామీ అమలులో చిత్తశుద్ధి కూడా అంతంతమాత్రమే. ఉపముఖ్యమంత్రి ధర్మాన లాంటి వాళ్లు ఉపాధి హామీ పనులపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటే.. పేదల ఉపాధిపై వారికెలాంటి అభిప్రాయం ఉందో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. కళ్ల ముదు ఇదంతా కనిపిస్తున్నా.. ప్రజల్లో కనీస ఆవేదన కూడా కనిపించడం లేదు.
పన్నుల బాదుడుతో ప్రజల నిలువ దోపిడి..!
పోనీ ప్రభుత్వం జనరంజకంగా పరిపాలిస్తుందా అంటే.. మద్యం నుంచి పెట్రోల్ వరకూ అన్ని పొరుగు రాష్ట్రాలకు పోయే పరిస్థితిని ప్రభుత్వం తెచ్చి పెట్టింది. మద్య నిషేధం పేరుతో మందుబాబుల కుటుంబాలను పీల్చి పిప్పి చేసేసింది. కావాల్సిన బ్రాండ్ పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించుకుని అయినా బ్లాక్‌లో కొనుక్కుని అయినా తాగుతున్నారు. పెట్రోల్ పొరుగు రాష్ట్రంలో లీటర్‌కు ఐదు రూపాయలు తక్కువకు వస్తుంది. కనీసం అభివృద్ది వాహకాలుగా ఉండే రోడ్లు ఏమైనా బాగున్నాయా అంటే అదీ లేదు. ఏడాదిన్నర నుంచి నిర్వహణ లేక .. రోడ్లన్నీ నాశనం అయ్యాయి. ఏ ప్రభుత్వం ఉన్న రోడ్ల నిర్వహణకు రూ. 300 కోట్లు కేటాయించేది. ఈ ప్రభుత్వం రూ. 12 కోట్లు కేటాయించింది. అదీ కూడా విడుదల చేయలేదు. రోడ్లను బాగు చేయడానికి పెట్రోల్‌పై పన్ను పెంచారు కానీ.. ఆ సొమ్మెటు పోతుందో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం పెంచిన పన్నుల ప్రభావం నిత్యావసరాలపై పడింది. ఆరు నెలల కిందటితో పోలిస్తే.. ఇప్పుడు నిత్యావసరాల ధరలు 30 శాతం వరకూ పెరిగాయి. ఆదాయం తగ్గిపోయిన ప్రజలపై ప్రభుత్వం పిడుగేసిందన్నమాట. చివరికి పిల్లల్ని ఇంటర్ మీడియట్లో జాయిన్ చేయాలన్నా…. ప్రభుత్వ నిర్వాకం వల తిప్పలు పడాల్సిన పరిస్థితి. పొరుగురాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి. అలా పొరుగురాష్ట్రాలకు పోవలాంటే.. వారి పన్నులతో కట్టిన రోడ్లపైన.. అదీ కూడా గుంతల రోడ్లపైన.. ప్రయాణించాలంటే టోల్ కూడా వసూలు చేసే దుస్థితి. అయినా ప్రజల్లో ఆలోచన కనిపించడం లేదు.
అప్పులు తెచ్చి నిరర్థక వ్యయం… ప్రజల భవిష్యత్ అంధకారం..!
ఓ వైపు ఉపాధి లేదు.. మరో వైపు పన్నుల భారం.. దీనికి తోడు ప్రభుత్వం విచ్చలవిడిగా తెస్తున్న అప్పులు ప్రజల్ని మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి. ఏడాదిలోనే ప్రతి ఒక్క ఏపీ పౌరుడిపై ప్రభుత్వం పెంచిన అప్పు లక్ష దాకా ఉంటుంది. ఇన్ని అప్పులు తెచ్చి రాష్ట్ర భవిష్యత్‌కు ఏమైనా భరోసా ప్రభుత్వం ఇస్తోందా అంటే.. ఇంకా పాతాళంలోకి పరిస్థితిని తీసుకెళ్తోంది. ఏడాదిన్నరలో ఒక్కటంటే.. ఒక్కటి కూడా సంపద సృష్టించే ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఒక్క పరిశ్రమ రాలేదు. అమరావతిపై కులం ముద్ర వేసి మూడు ముక్కలాట ప్రారంభించారు. ప్రజల్లో విబేధాలు పెంచారు. పోలవరం ప్రాజెక్ట్ రిస్క్‌లో పడిపోయింది. ఆ ప్రాజెక్ట్ ఒక్క రోజు నిలిపివేస్తే.. కనీసం 10కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని నిపుణుల అంచనా. అలాంటిది ఏడాదిన్నరగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పుడు ఏపీలో ఒక్కటంటే ఒక్క మౌలిక సదుపాయల ప్రాజెక్ట్ నిర్మాణం సాగడం లేదు. అయినా ప్రజల్లో కదలిక కనిపించడం లేదు.
కోటా బియ్యం చాలనుకుంటున్నారా..? కేసులకు భయపడుతున్నారా..?
ప్రజలు ఎందుకు తిరగబడటం లేదనే విషయం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రభుత్వ పథకాలు వారిని ఈ అసంతృప్తి నుంచి దూరం చేస్తున్నాయనే భావన కొంత మందిలో ఉంది. కానీ పథకాలు పది మందికి అందితే.. పదివేల మందికి అందడం లేదనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వ పథకాల్లో డొల్ల ఎంత ఉంటుందంటే.. సగటున నియోజకవర్గానికి మొత్తం కలిపి టైలర్లు, బార్బర్లు వంటి వారికి వంద మందికి కూడా పదివేల సాయం చేయలేదు. మిగతా బార్బర్లు, టైలర్లు తాము మోసానికి గురయ్యామన్న భావనలో ఉన్నారు. దాదాపు అన్ని పథకాల్లోనూ అంతే. వీరెవరూ నోరు తెరవలేకపోవడానికి ఏకైక కారణంగా కనిపిస్తోంది. అదే కేసులు. పోలీసు వ్యవస్థ పూర్తిగా నేరాల నియంత్రణ కన్నా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తే వారి అంతు చూడటానికే పని చేస్తోందనేది బహిరంగరహస్యం. ఆ భయంతోనే ఎవరూ నోరెత్తలేకపోతున్నారు. రోడ్లపైకి రాలేకపోతున్నారు.