వాగ్వాదం అంటే అధికార ప్రతిపక్షాల మధ్య జరగడం సహజం..! కానీ, ఆంధ్రాలో మాత్రం మిత్రపక్షాలు కత్తులు నూరుకుంటున్నాయి. భాజపా వెర్సెస్ టీడీపీ అన్నట్టుగా మారిపోయింది. అయితే, ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తోంది..? రాష్ట్రవ్యాప్తంగా భాజపా తీరుపై సామాన్యుల నుంచి ఆగ్రహం వ్యక్తమౌతుంటే… పోరాడాల్సిన ప్రతిపక్ష నేత మౌనంగా ఏం చేస్తున్నారు..? చంద్రబాబుపై వారు చేయాల్సిన విమర్శలన్నీ భాజపా నేతలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారా..? లేదంటే, బుద్ధా వెంకన్న ఆరోపించినట్టుగా సోము వీర్రాజు లాంటివారికి తెరవెనక నుంచి ప్రోత్సాహం ఇస్తూ విమర్శలు చేయిస్తున్నారా..? వైకాపా విమర్శల్ని ఎలాగూ ప్రజలు పెద్దగా పట్టించుకోరు కాబట్టి, మిత్రపక్షమైన భాజపాని ఉసిగొల్పితే టీడీపీని ఇరకాటంలోకి నెట్టొచ్చన్నదే వ్యూహమా..?
సోము వీర్రాజు ప్రెస్ మీట్ గానీ, అంబటి రాంబాబు ప్రెస్ మీట్ గానీ, జగన్ వ్యాఖ్యలుగానీ, చివరికి సాక్షి పత్రికగానీ… ఎక్కడ చూసినా భాజపాని జగన్ విమర్శించిన దాఖలాలు లేవు, భాజపా కూడా జగన్ పాత్రను ప్రశ్నించదు! ఇప్పుడు భాజపా గొంతు వైకాపాదే అన్నట్టుగా మారిపోయింది. మంత్రి కామినేని శ్రీనివాస్ మాత్రమే జగన్ తో భాజపా పొత్తు ఏంటని ప్రశ్నిస్తుంటారు. మిగతా భాజపా నేతలు ఆ విషయాన్నే మాట్లాడరు..! తన కేసుల విషయమై ఢిల్లీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారనీ, అందుకే మౌనంగా ఉంటున్నారనే ఊహాగానాలు నిజమేనేమో అనిపించే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఈ లెక్కన భాజపాతో లాలూచీ పడుతున్నది ఎవరు..? రాష్ట్ర ప్రయోజనాల కోసం మిత్రపక్షాన్ని కూడా వదులుకునే స్థాయికి టీడీపీ పోరాటం చేరుకుంటోంది. భాజపా, టీడీపీల మధ్య పొత్తు దాదాపు తెగే దశకు వచ్చేసింది. జగన్ కోరుకుంటున్నది ఇదే కదా! ఒకసారి పొత్తు తెగితే… వెంటనే వారు భాజపా పంచన చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, ఇక్కడే అసలు విషయం జగన్ మరచిపోతున్నారు.
ఆంధ్రాలో భాజపాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. మోడీ మోసం చేశారనే భావన ప్రతీ సామాన్యుడిలో బలంగా నాటుకుంది. కాబట్టి, ఒకవేళ వైకాపా ఆశిస్తున్నట్టు భాజపాతో పొత్తు పెట్టుకుంటే… ఆ వ్యతిరేకతలో భాగం పంచుకోవాల్సిందే! రాష్ట్ర ప్రయోజనాలు కల్పించాల్సిన కేంద్రాన్ని వదిలేసి, చంద్రబాబును విమర్శిస్తున్న జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం భాజపాకి వైకాపా దగ్గరయ్యే తీరును అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ వైకాపా వ్యూహకర్తలు అర్థం చేసుకోవాల్సిన విషయం… ఇప్పుడున్న పరిస్థితుల్లో భాజపాకు మద్దతుగా వైకాపా నిలుస్తోందనే భావన ప్రజల్లోకి మరింత బలంగా చొచ్చుకుపోతే, అంతిమంగా వైకాపా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది..! భాజపా అంటకాగుతూ మరింత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకునే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.