ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నేరాలు, ఘోరాలు జరుగుతున్నా .. దేశం అంతా వింతగా చూస్తున్నా.. పోలీసులు మాత్రం నిమ్మళంగా ఉంటారు. కానీ వైసీపీ రాజకీయాలకు.. ప్రభుత్వ పెద్దల ” అల్పబుద్ది కక్ష సాధింపుల ” కోసం అయితే డిపార్టుమెంట్ మొత్తం పరుగులు పెడుతూ ఉంటుంది. వరుగా దానికి సంబంధించిన సాక్ష్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాము ఐపీఎస్లమనే సంగతిని కూడా వారు మర్చిపోవాల్సి వస్తోంది. కుట్రలు, కుతంత్రాల రాజకీయంలో భాగం అయి మానసిక వేదనకు గురవుతున్నారో లేదో కానీ.. వ్యవస్థను మాత్రం బలహీనం చేస్తున్నారు.
ఇటీవల పవన్ కల్యాణ్ .. సీఐ అంజూ యాదవ్ పై ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు ఎస్పీ వాలంటీర్లపై వివరణ అడిగినట్లుగా ప్రచారం జరిగింది. మీడియాతో ఆయన చెప్పలేదు కానీ..ఆయన పేరుతో విడుదలైన ప్రెస్ నోట్లో మాత్రం ఉంది. అసలు తప్పంతా మీ వల్లే జరగిందని ఎస్పీ అన్నారని ప్రెస్ నోట్. నిజానికి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అలా చెప్పలేకపోయారు.కానీ ప్రెస్ నోట్తో చెప్పించారు. ఆయనకు అది తప్పనిపించి ఉండవచ్చు..కానీ నోరు మెదపలేని పరిస్థితి.
ఇదే తరహాలో విజయవాడ సీపీ కాంతిరాణా టాటా ఓ ప్లాంటెడ్ కేసుతో మార్గదర్శి మేనేజర్ ను అరెస్ట్ చేశారు. నిజానికి అది అరెస్ట్ చేసేంత కేసా ? అంటే కానే కాదు.కానీ ఫిర్యాదు దారుడ్ని సైతం పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ నిర్వహించేశారు. చిట్ ఫండ్ సంస్థలో చిట్ పాడుకున్న తర్వాత తగినంత ష్యూరిటీలు ఇవ్వకపోతే ఏ సంస్థ కూడా మొత్తం ఇవ్వదు. కానీ ఆయన బ్యాంకుకు తాకట్టు పెట్టేసిన ఓ ఆస్తిని.. అది కూడా ఎన్పీఏ అయిన ఆస్తి పత్రాలు తెచ్చి ఇచ్చి వాటిని ష్యూరిటీగా పెట్టుకోలేదని కేసు పెట్టేశారు. మేనేజర్ ను అరెస్ట్ చేశారు. మార్గదర్శిపై ఏదో విధంగా కక్ష సాధింపులు చేద్దామనే పాలకుల అల్పబుద్ది కుట్రల్లో పోలీసులు ఇలా భాగమవుతున్నారు. కానీ తర్వాత పర్యవసానాలు ఎదుర్కోవాల్సింది కూడా పోలీసులే కదా.
నాలుగేళ్ల నుంచి ఇదే తంతు. పోలీసులు నిజాయితీగా ఇలాంటివి చేస్తారని ఎవరూ అనుకోలేరు. కానీ..పోస్టింగ్ ల కోసం.. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం దిగజారిపోతున్నారు. ఫలితంగా పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోతోంది. నేరస్తుల్లో నమ్మకం పెరుగుతోంది. ఎన్నెన్ని దారుణాలు వెలుగు చూస్తున్నా… పోలీసుల స్పందన ప్రజల్ని నిరాశకు గురి చేస్తోంది. వ్యవస్థను బలహీనం చేసుకుని.. ఆ వ్యవస్థలో ఉన్న వారు ఏం సాధిస్తారు ?