వైసీపీలో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఈ సారి టిక్కెట్ల కోసం పోలీస్ ఆఫీసర్ల నుంచి విపరీతమైన వత్తిడి ఉండే అవకాశం కనిపిస్తోంది. రాజకీయంగా వైసీపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తూ టీడీపీ నేతలపై దాడులు చేస్తూ కేసులు పెట్టడమే కాకుండా వారిపై తొడలు కొట్టి మీసాలు మేలెసే పోలీసు అధికారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. టీడీపీ హయాలో సీఐగా ఉంటూ ఇదే పని చేసిన గోరంట్ల మాధవ్ కు ఎంపీ టిక్కెట్ ఇచ్చి జగన్ గెలిపించారు. ఇదేదో బాగుందని పోలీసుల్లో రాజకీయ ఆశలు ఉన్న వారంతా ఇదే పని చేస్తున్నారు.
కదిరి సీఐ చేసిన ఓవరాక్షన్ రాష్ట్రమే కాదు దేశం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపీలో పోలీసులు మంచి హుషారుగున్నరే అనుకుంటున్నారు. అయితే ఆ హుషారు వెనుక వైసీపీ టిక్కెట్ల రేస్ ఉందని రాష్ట్ర రాజకీయాలపై అవగాహన ఉన్న వారికే అర్థమవుతుంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే పలువురు పోలీసు అధికారల పేర్లు వైసీపీ అభ్యర్థిత్వం కోసం ప్రచారంలోకి వచ్చాయి. తాడిపత్రి డీఎస్పీ చైతన్య వ్యవహారం మామూలుగా ఉండదు. ఆయన పేరును అభ్యర్థిత్వానికి పరిశీలిస్తున్నారని అంటున్నారు.
టీడీపీ నేతలను టార్గెట్ చేసుకున్న అనేక మంది పోలీసు అధికారులు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి దారుణంగా ఉంటుందని… అందుకే వీఆర్ఎస్ తీసుకుంటామని రాజకీయ పునరావాసం కల్పిచాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ నిండా మునిగిపోయారు. ఆయనపై చర్యలకు కేంద్రం ఆదేశించింది. ఆయనతో చేయిచింది ప్రభుత్వమే కాబట్టి ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోకుండా ఏదో కారణంతో ఆపొచ్చు. కానీ ప్రభుత్వం మారితే ఆయన పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందుకే ఆయన కూడా ఓ వైసీపీ టిక్కెట్ మొర పెట్టుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
ఎలా చూసినా ఈ సారి వైసీపీ హైకమాండ్ కు పోలీసు అధికారుల నుంచి టిక్కెట్ల నుంచి ఒత్తిడి పెరగనుంది. వాళ్లను ఇష్టారాజ్యంగా వాడుకున్నందుకు వారి కోటాలో కొన్ని టిక్కెట్లు అయినా కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా వ్యవస్థను భ్రష్టుపట్టించి.. వారికి రాజకీయ ఆశలు కల్పించిన అధికార పార్టీ చివరికి ఇబ్బందిపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి