నోటీసుల్లేకుండా అరెస్టులు… కేసులతో సంబంధం లేని అపహరణలు… దొంగ కేసులు వంటి వాటి విషయంలో.. న్యాయస్థానాల నుంచి తీవ్ర విమర్శలు.. సీబీఐ విచారణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులకు..ఉన్న గౌరవం తగ్గిపోతోంది. ఆ విషయం వైసీపీ నేతలే పదే పదే రుజువు చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఉండవల్లి శ్రీదేవి అనే ఎమ్మెల్యే ఓ సీఐకి ఫోన్ చేసి.. కాళ్లు పట్టుకోవడాల గురించి మాట్లాడేశారు. ఆ విషయం హాట్ టాపిక్ అవుతూండగానే… కనీసం ఎమ్మెల్యే కూడా కానీ మరో వైసీపీ నేత.. తన కారును తనిఖీ చేయడానికి ఆపినందుకు… ఒంటి మీద నీ ఖాకీ డ్రెస్ ఉండాలో… తాను రాజకీయం చేయాలో తేలాలని నడి రోడ్డు మీద చిందులేశారు. దీంతో ఆ సీఐ ఏమీ చేయలేక నీళ్లు నమలాల్సి వచ్చింది.
ఈ రెండు ఇటీవల జరిగిన ఘటనలే. తమ మాట వినని పోలీసుల్ని వైసీపీ నేతలు అడ్డగోలుగా బెదిరిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి రాని ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆయా చోట్ల ప్రజలు వాటి గురించి కథలు కథలుగా చెప్పుకుటూ ఉంటారు. చాలా చోట్ల పోలీస్ స్టేషన్లలో వైసీపీ నేతలే తిష్ట వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమ మాట వినే పోలీసుల్ని ఎస్ఐలు…సీఐలు.. డీఎస్పీలుగా తెచ్చుకుని కొంత మంది దందాలు చేస్తున్నారని.. ఒక వేళ వారు వినకపోతే.. బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. చోటా వైసీపీ నేత వచ్చి పోలీసులపై దాడి చేసినా… కేసు నమోదు చేయలేని నిస్సహాయ స్థితికి పోలీసులు చేరిపోయారని… ఇలాంటి ఘటనల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతూండటాన్ని చూసి అర్థం చేసుకోవచ్చంటున్నారు.
డీజీపీ గౌతం సవాంగ్‌ను కోర్టు.. చేతకాకకపోతే రాజీనామా చేయాలని సలహా ఇచ్చింది. ఆయన పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయడం విపలమయ్యారని… అందుకే వారు దారి తప్పారన్న అభిప్రాయంతో కోర్టు అలాంటి వ్యాఖ్యలు చేసింది. ఇది పోలీసు వ్యవస్థకే తలవంపులు లాంటి పరిస్థితి. గతంలో ఏపీ పోలీసులు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం.. పరిస్థితి మారిపోయింది. పోలీసులంటే.. అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలని.. వారు చెప్పిన వారిపై .. కారణాల్లేకపోయినా కేసులు పెట్టడం… ఎవర్ని తీసుకు రమ్మంటే వారిని తీసుకెళ్లడం లాంటి పనులు చేయడానికేనన్న ముద్ర పడిపోయింది.
మరో వైపు రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాలు.. దారి దోపిడీలు బీహార్ స్థాయిలో పెరిగిపోతున్నాయి. నడుస్తున్న వాహనం నుంచి సెల్ ఫోన్ల లోడ్ కొట్టేసే స్థాయి నేరాలు గతంలో బీహార్‌లో జరిగేవి. కానీ ఇప్పుడు ఏపీ జాతీయ రహదారుల మీద జరుగుతున్నాయి. ముఠాలను పట్టేసుకున్నామని పోలీసులు చెబుతారు కానీ.. వారు ఊరకే అలా చెబుతున్నారని.. వెంటనే మరో దొంగతనంతో దొంగలు తేల్చేస్తున్నారు. ప్రాణాలు, ఆస్తులకు రక్షణ లేదనే భావన ప్రజల్లో పెరుగుతోంది. ఓ వైపు కోర్టు అక్షింతలు.. మరో వైపు వైసీపీ నేతల నుంచి అవమానాలు.. మరో వైపు దిగజారుతున్న శాంతిభద్రతలు.. అన్నీ కలిపి పోలీసులు వారి గౌరవాన్ని వారు కాపాడుకునేలా విధులు నిర్వహించలేకపోతున్నారన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పటికైనా కళ్లు తెరిస్తే.. ఇమేజ్ మెరుగుపడుతుంది లేకపోతే.. ముద్ర అలాగే ఉండిపోతుంది.