కొద్ది రోజుల క్రితం.. ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ ఆర్డీవో ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీకి చేరారు. అక్కడే వైద్యం పొంది.. పండంటి బిడ్డతో ఇంటికి వెళ్లారు. వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ఈ అధికారి చేసిన ప్రయత్నం నిజంగా అభినందనీయం. ప్రభుత్వానికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా… సంబంధం ఉన్న వాళ్లంతా.. కార్పొరేట్ ఆస్పత్రుల వైపు పరుగులు పెట్టకుండా.. ప్రభుత్వ ఆస్పత్రులకే వస్తే.. సామాన్యుల్లోకూ భరోసా ఉంటుంది. కానీ ఆ అధికారి స్ఫూర్తి.. డిప్యూటీ సీఎంలకు… ఎంపీలకు…ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న వారికి ఉండటం లేదు. ఫలితంగా.. ఏపీలో అందుతున్న వైద్యం అంతా.. డొల్లేనని.. సాక్ష్యాలతో సహా బయటపడుతోంది.
కాస్త పలుకుబడి ఉన్న వారంతా పొరుగు రాష్ట్రాల వైద్యానికే..!
డిప్యూటీ సీఎం ఆంజాద్ భాషా.. తిరుపతి స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో కరోనా చికిత్సకు చేరి.. ఒక్కటంటే.. ఒక్క రోజులోనే అక్కడి పరిస్థితుల్ని చూసి.. హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రిలో బెడ్లు చూసుకుని హుటాహుటిన సొంత వాహనంలో వెళ్లిపోయారు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేకు కరోనా వస్తే చెన్నై వెళ్లి అపోలోలో చేరారు. తిరుపతిలో కొంత మంది టీటీడీ ప్రముఖులకూ వచ్చినా.. అదే చెన్నై వారికి కనిపిస్తోంది. ఇక.. ఎమ్మెల్యేలు..ఎంపీలు.. ఓ స్థాయి నేతలు ఎవరైనా హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రుల వైపే చూస్తున్నారు. చివరికి విజయసాయిరెడ్డి కూడా… అపోలోలో చేరిపోయారు. ఆంధ్రాలో వైద్యం గురించి.. జగన్ వచ్చిన తర్వాత మార్పుల గురించి.. ఓ బ్రాండ్ అంబాసిడర్లా ఆయన ప్రచారం చేశారు. చివరికి ఆయన అపోలోలో చేరాల్సి వచ్చింది. దీంతో అంతా ప్రచార ఆర్భాటమే తప్ప..ఏపీలో వైద్యం అంతా డొల్లేనని.. వాళ్లే నిరూపిస్తున్నారన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ వైద్యంపై ప్రచార ఆర్భాటం.. అంతంతమాత్రం సౌకర్యాలు..!
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైద్యంపై ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. చేస్తున్న వైద్యం తక్కువ చేసుకుంటున్న ప్రచారం ఎక్కువ అన్నట్లుగా మారిపోయింది. ఇటీవలి కాలంలో కోవిడ్ పేషంట్ల మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కర్నూలు ఆస్పత్రిలో ఆక్సీజన్ ప్లాంట్ చెడిపోయి.. నాలుగు రోజులు అవుతోంది. ఆక్సీజన్అందక.. అక్కడరోజుకు పది మందికిపైగా చనిపోతున్నారని చెబుతున్నారు. కానీ ఆ ప్లాంట్ మాత్రం ఇంత వరకూ రిపేర్ చేయించలేదు. అన్ని చోట్లా ఇంతే మౌలిక సదుపాయాల కొరత ఉంది. కానీ.. ప్రభుత్వం మాత్రం.. ఐదు ఆస్పత్రులు.. పది ఆస్పత్రులు.. 1500 బెడ్లు కట్టేస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటోంది. ఇతర రాష్ట్రాల ఆస్పత్రుల ఫోటోలతో నిస్సిగ్గుగా సోషల్ మీడియాలోకి సలహాదారులు ఎక్కిపోతున్నారు.
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం లేకుండా చేస్తున్న ముఖ్యులు..!
సొంత ప్రభుత్వంపై నమ్మకం లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే.. సామాన్య ప్రజలకు అంతకు మించిన…. సందేశం మరొకటి ఉండదు. ప్రభుత్వం చెప్పేది.. చేసేది అంతా వేర్వేరు వేర్వేరు అని.. వారికి సులువుగానే అర్థం అయిపోతుంది., ప్రస్తుతం కరోనా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు.. అదే సందేశం ఇస్తున్నారు. ఉపముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వాన్ని తన భుజాలపైనే వేసుకుని నడుపుతున్నానని భావించే విజయసాయిరెడ్డి వరకూ అందరూ పోలోమంటూ హైదరాబాద్కు వెళ్లిపోవడమే… దీనికి సాక్ష్యం. ఇక వారెన్ని మాటలు చెప్పినా.. ఏపీలో ప్రభుత్వ వైద్య సౌకర్యాలపై ప్రజలకు నమ్మకం కలగదు.