మరి కొద్ది వారాల్లో తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. వైఎస్ఆర్ సీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు ఆధారంగా ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో వరుసబెట్టి ఉపఎన్నికలు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..
ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, పక్క పార్టీ నేతల ని తమ పార్టీకి ఫిరాయింపజేసుకోవడం ఇటీవల కాలంలో సర్వ సాధారణం అయిపోయింది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. దాదాపు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే అధికార పార్టీ తో టచ్ లో ఉన్నారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్ రికార్డు లలో టీడీపీ ఎమ్మెల్యేలే అయినప్పటికీ వైఎస్సార్సీపీ తో అంటకాగుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు మాత్రం టిడిపి లాగా తాము అనైతిక రాజకీయాలు చేయమని, తమ పార్టీ లో లో చేరే నేతలతో రాజీనామా చేయించి తమ పార్టీ టికెట్ మీద గెలిపించుకుంటామని చెబుతూ వస్తున్నారు. అయితే పలు కారణాల వల్ల ఇప్పటివరకు తమ పార్టీ తో ఉన్న టిడిపి నేతలను ఎన్నికలకు పంపలేదు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేసుకున్న కారణంగా వైఎస్ఆర్సీపీ ఇదే హవాను ఈ ఏడాదంతా కొనసాగించే విధంగా వ్యూహ రచన చేస్తోంది. ప్రత్యేకించి తిరుపతి ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచినట్లయితే , ఫలితాలు వెలువడిన 1-2 నెలల లోపే ఈ నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఈ ఏడాది చివరిలోగా ఈ నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. మరి నాలుగు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు వచ్చేలాగా వైఎస్ఆర్సిపి ప్లాన్ చేస్తుందా లేక తమ పార్టీ మీద ఉన్న పాజిటివ్ వేవ్ మరింత కాలం కొనసాగేలా ముందు కొందరిని తర్వాత కొందరిని రాజీనామా చేయిస్తుందా అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది.
ఇక్కడ ఇంకొక కొసమెరుపు ఏమిటంటే ఒకవేళ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ వస్తే, ఇప్పటికే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా అందించిన గంటా శ్రీనివాసరావు రాజీనామాను కూడా తమ్మినేని సీతారాం ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పుడు ఇదే ఏడాదిలో ఐదు ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి వస్తుంది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది ఈ సమాచారం ఎంతవరకూ నిజమన్నది మరి కొద్ది నెలల్లో తేలుతుంది.