తమలపాకుతో నువ్ ఒకటి అంటే తలుపు చెక్కతో నేను రెండు అంటా అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు బూతులతో విరుచుకుపడుతున్నారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన తర్వాత ఏపీలో రాజకీయం వేడెక్కింది. నారా లోకేష్ రమ్య కుటుంబాన్ని పరామర్శించారు. అయితే ఆ పరామర్శను పోలీసులు అడ్డుకోవడం.. లోకేష్‌ను అరెస్ట్ చేయడంతో రాజకీయ దుమారం రేగింది. లోకేష్ కూడా ఘాటు విమర్శలు చేయడంతో వైసీపీ నేతలు తెర ముందుకు వచ్చారు. ముందుగా వైసీపీ బ్రాండ్ లాంగ్వేజ్‌లో మాస్టర్ అయిన కొడాలి నాని బండబూతులు తిట్టారు.
లోకేష్‌ను చంద్రబాబును కలిపి తిట్టి వెళ్లిపోయారు. తర్వాత వైసీపీకి చెందిన కొంతమంది దళిత ఎమ్మెల్యేలు బ్యాటన్ అందుకున్నారు. వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున మరింత ఆవేశ పడిపోయారు. వారు తిట్టిన తిట్లను వైసీపీ సపోర్టింగ్ మీడియా మొత్తం ప్రసారం చేసింది. నిజానికి కాస్త ప్రమాణాలు పాటిస్తే వారి ప్రసంగంలో బీప్ సౌండ్లు తప్పఏమీ వినిపించవు. అంతగా తమ ఫ్రస్ట్రేషన్ తీర్చుకున్నారు. తర్వాత టీడీపీ కూడా సైలెంట్‌గా ఉంటే ఎట్లా అని.. తమ పార్టీ అధికార పార్టీ ప్రతినిధులుగా ఉన్న దళిత నేతల్ని రంగంలోకి దించింది. ఎం.ఎస్.రాజ్, పిల్లి మాణిక్యాలరావు .. తమ నేతలపై వైసీపీ నేతలు ఎలా తిట్టారో అంతకు రెండింతలు తిట్టి చూపించారు.
చూసుకుందాం రమ్మని సవాల్ చేశారు. వీళ్లతిట్ల వీడియోలతో రెండు పార్టీల సానుభూతిపరులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. మా నేతలు తిట్టిన వాటిని చూస్తే మీ నేతలు ఉరేసుకుంటారని ఒకరు.. మా నేతలు తిట్టిన తిట్లు వింటే నీళ్లు లేని బావిలో దూకుతారని మరొకరు సెటైర్లు వేసుకుంటున్నారు. నిజానికి నిన్నటి వరకూ సోషల్ మీడియా కార్యకర్తలు తిట్టుకునేవారు. ఇప్పుడు అప్ గ్రేడ్ అయి ఇరు పార్టీల నేతలే అలా తిట్టుకుంటున్నారు. ఇంకా పరిస్థితి ఎంత వరకూ దిగజారుతుందో చెప్పడం కష్టం.