ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. నిన్నటిదాకా రైతు సమస్యలు, రోడ్లు, డ్రగ్స్ , పెన్షన్లు అంటూ సాగిన రాజకీయం ఒక్కసారిగా కులాల చుట్టూ తిరగడం ప్రారంభమయింది. సినీ పరిశ్రమ సమస్యలు అంటూ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విరుచుకుపడటం దాన్ని మంత్రి పేర్ని నాని వ్యూహాత్మకంగా కులం వైపు మళ్లించడంతో పరిస్థితి మారిపోయింది. హఠాత్తుగా ప్రజా సమస్యలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా కులం చర్చలే జరుగుతున్నాయి.
వారం రోజుల కిందటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డ్రగ్స్ అంశం కీలకంగా ఉంది. గుజరాత్లోని ముంద్రా పోర్టులో రూ. వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడటం.. ఆ సరుకు దిగుమతి చేసుకుంది విజయవాడలో రిజిస్టరయిన కంపెనీ కావడంతో వివాదం ప్రారంభమయింది. ఆ సంస్థ పట్టుబడటానికి ముందే పెద్ద ఎత్తున హెరాయిన్ దిగుమతి చేసుకుని ఏపీలో జీఎస్టీ కూడా కట్టిన విషయాన్ని టీడీపీ బయట పెట్టింది. ఈ వ్యవహారంలో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ నుంచి తెలంగాణకు రవాణా చేస్తున్నగంజాయిని సరిహద్దుల్లో పోలీసులు పట్టుకున్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే కుమారుడు దొరికినా లాబీయింగ్ చేయించుకుని కేసు లేకుండా చేసుకున్నారని టీడీపీ ఆరోపణలు ప్రారంభించారు. సవాళ్లు కూడా చేసుకున్నారు. అయితే ఈ అంశం ఒక్క సారిగా తెర వెనక్కి వెళ్లిపోయింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ జగన్ కోసం పని చేయడం ప్రారంభించారని ఆరోపిస్తున్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా ఇప్పుడు టాపిక్ మాత్రం మారిపోయింది. పవన్ కల్యాణ్ కూడా కులం గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీంతో ఎన్నికల కోసం అసలు రాజకీయం ప్రారంభమైందన్న అభిప్రాయం వినిపిస్తోంది.