“శత్రువుల్ని ఆర్థికంగా కుంగదీసి.. తిండి కూడా లేకుండా చేయడం.. తర్వాత వారికే జాలితో రెండు ముద్దలు పడేసి ఆకలి తీల్చి.. జేజేలు అందుకోవడం” అనేది రాయలసీమలో ఫ్యాక్షనిస్టు పాలెగాళ్ల ప్రధానమైన వ్యూహం. దశాబ్దాల కిందట జరిగింది అదే. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అదే జరుగుతోంది. పేద ప్రజల్ని పీల్చి పిప్పి చేసి వారిని నానా రకాలుగా ఆర్థికంగా బలహీనుల్ని చేసి..అప్పులపాలు చేసి చివరికి పథకాల పేరుతో వారికి రెండు ముద్దలు పడేసి.. ఆకలి తీర్చామని .. దేవుళ్లమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా తమకు ఓటు వేసి అధికారం ఇచ్చిన వారిని బాగా చూసుకుంటారు. వారు మళ్లీ ఓట్లు వేయకపోతే తమకు అధికారం రాదని భయపడతారు. కానీ ఏపీలో మాత్రం భిన్నం. తమకు ఓట్లు వేసిన వర్గాలను రాచి రంపాన పెడుతున్నారు. ఎన్నిరకాలుగా అంటే.. అన్ని రకాలుగా వారి వద్ద పిండుకుంటున్నారు. అప్పుల పాలు చేస్తున్నారు. చివరికి వారి కుటుంబాలు బతకాలంటే.. ప్రభుత్వం వైపు చూడాలన్నట్లుగా చేస్తున్నారు. ఓటు బ్యాంక్‌గా వర్గాలను పీల్చి పిప్పి చేసి.. తిండి లేకుండా చేసి.. రెండు ముద్దలు పడేస్తే.. ఇక ముందు ఏ సమస్యా లేకుండా.. ఎలాంటి డిమాండ్లు పెట్టకుండా తమకే ఓట్లేస్తారనే ఫ్యాక్షన్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ ఫ్యాక్షన్ రాజకీయ వ్యూహంలో చిక్కిన ఏపీ ప్రజలు మూడున్నరేళ్లుగా చిక్కిశల్యమైపోతున్నారు. అప్పుల పాలవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం వారిని డెబిట్ ట్రాప్‌లోకి లాగేసింది.
అన్నీ పేదలను దోపిడీ చేసే స్కీములే !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెబుతూ ఉంటుంది. అయితే.. అంతకు మించి పేదల నుంచి పిండుకోవడానికి పథకాలు పారిస్తోంది. మద్యం ధరలను ఒక్క సారిగా షాక్ కొట్టేలా పెంచడం దగ్గర్నుంచి.. వన్ టైమ్ సెటిల్మెంట్, ఇంటి వద్దకే రేషన్ బియ్యం, చెత్త పన్ను , ఆస్తి పన్ను, అందరికీ ఇళ్లు పేరుతో స్కాంలు ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ పేదలను నిట్ట నిలువుగా దోచుకునే పథకాలను ఎన్నింటినో పెట్టింది. వాటి కారణంగా బీద, మధ్యతరగతి ప్రజలు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వారిని అప్పుల పాలు చేస్తుందన్న అనుమానాలు రావడానికి ఈ స్కీములే కారణం.
పేద కుటుంబాల సగం ఆదాయాన్ని మద్యం ధరల పెంపుతో లాగేసుకుంటున్న ప్రభుత్వం !
మద్యం అలవాటు ఎక్కువగా ఉండేది ఎవరికి? ఎవరు మద్యం మీద ఎక్కువ ఖర్చు పెడతారు ? ఈ అంశంపై పెద్దగా ఎవరూ పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. ఏపీలో ఉండే ఎగువ .. ఉన్నత కుటుంబాలు మద్యం మీద పెట్టే ఖర్చు వారి ఆదాయంతో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకంటే వారి కుటుంబాలు చాలా పరిమితం. ఏపీలో ఉన్న రేషన్ కార్డుల ప్రకారం చూస్తే..85 శాతం మంది కన్నా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఉంటారు ఇటీవల జగన్ ఏపీ పేద రాష్ట్రమని 80 శాతానికిపైగా ప్రజలు పేదవారేనని బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రకారం చూస్తే ఏపీలో మద్యం తాగే వారంతా పేదలే. ప్రభుత్వానికి లభిస్తున్న రూ. పాతిక వేల కోట్ల మద్యం ఆదాయం ఆ పేద ప్రజల సొమ్మే. ఓ రోజు కూలీ లేదా చిరు వ్యాపారి రోజంతా కష్టపడితే ఓ రూ .వెయ్యి సంపాదించుకోగలుగుతారు. ఆ వెయ్యిలో మద్యం అలవాటు ఉన్న వ్యక్తి.. రూ. ఐదువందలు ప్రభుత్వానికి సాయంత్రానికి టాక్స్ చెల్లిస్తాడు. అంటే సగం ఆదాయాన్ని ప్రభుత్వానికే ధారబోస్తున్నాడు. ఇక ఐదువందలతో ఇల్లు గడవాలి సాధ్యమేనా ? . నిజానికి ఏపీలో రోజుకు వెయ్యి కూడా సంపాదించలేని కుటుంబాలే ఎక్కువ. స్వంతంగా ఎదిగే ప్రయత్నాలు నిలిచిపోవడం.. రియల్ ఎస్టేట్ ఎక్కడిక్కడ పడకేయడం.. ప్రభుత్వ ఖర్చు తగ్గిపోవడం.. ప్రాజెక్టులు నిలిచిపోవడం వంటి కారణాల వల్ల ఏపీలో ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇలాంటి సందర్భంలో పేదల కుటుంబాలు ..చిరు వ్యాపారులు.. చిరు ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. మద్యం అలవాటు ఉన్నకుటుంబాల జీవన ప్రమాణాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. చివరికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం.. పథకాల పేరుతో ఇచ్చే రూ .వెయ్యి.. రెండు వేల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు మద్యం అలవాటు ఉన్న కుటుంబాల్లో రూ. యాభై, వంద మాత్రమే ఖర్చుపెట్టేవి.. కానీ ఇప్పుడు అవి ఏకంగా ఐదు.. పది రెట్లు పెరిగిపోయింది. రెండేళ్ల కిందట చిత్తూరు జిల్లాలో మద్యానికి బానిసైన ఓ ఆటోడ్రైవర్.. మద్యం ధరల వల్ల తన కుటుంబం ఎంత దారుణంగా చితికిపోయిందో వివరిస్తూ.. మాట్లాడి.. సీఎం జగన్‌ను ఇష్టం వచ్చినట్లుగా తిట్టారు. తర్వాత ఆ ఆటో డ్రైవర్ అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆ కేసు ఏమయిందనే సంగతిని పక్కన పెడితే.. ఆయన అనుభవించిన నరకం.. ఇప్పుడు అనేక పేదల కుటుంబాలు అనుభవిస్తున్నాయి. ఆర్థికంగా చితికిపోయి.. కోలుకునే మార్గం కనిపించక మనోవేదనకు గురవుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. కొత్త బ్రాండ్ల పేరుతో సైలెంట్‌గా మరోసారి రేట్లు పెంచేశారు.
ఓటీఎస్ పేరుతో అప్పుల పాలు చేసేశారు..!
వన్ టైం సెటిల్మెంట్ స్కీం. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను ఏపీ సర్కార్ అప్పుల పాలు చేసింది. రూ. పది, ఇరవై వేలు కడితే.. గతంలో ఇళ్ల లబ్దిదారులపై ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు. ముఫ్పై ఏళ్ల కిందట తీసుకునన్న రుణాలను కూడా ముక్కు పిండి వసూలు చేశారు. నిజానికి వారంతా నిరుపేదలు.. రెక్కాడితే డొక్కాడనివారు. ఇళ్లకు పూర్తిగా రుణం ఇవ్వకపోయినా.. ఇప్పటికి ఉండటానికి ఇల్లు లేకపోయినా … వారిని వదిలి పెట్టలేదు. డబ్బులిచ్చి ప్రైవేటు సైన్యంలా పోషిస్తున్న వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, పోలీసులు ఇలా ఓ గుంపును.. పేదల ఇళ్లపైకి పంపి.. బెదిరించి మరీ వసూలు చేశారు. ఇవ్వలేని వారికి అప్పులు ఇప్పించారు. ఇలా ఓటీఎస్ పేరుతో పేదల నుంచి వసూలు చేసిన వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏం చేసిందో కానీ.. వారికి మాత్రం అప్పులు మిగిలాయి. ఆ ఇళ్లకు రిజిస్ట్రేషన్లు ఉచితంగా చేస్తామని.. బ్యాంకుల్లో లోన్లు ఇస్తామని కాకమ్మ కబుర్లు చెప్పారు. ఇప్పటి వరకూ అలా రిజిస్ట్రేషన్లు చేసి కనీసం వంద మందికైనా లోన్లు ఇచ్చారో లేదో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది. పేదలు మాత్రం ప్రభుత్వం తమతో బలవంతంగా చేయించిన అప్పునకు వడ్డీలు కట్టుకోవడానికి… ప్రభుత్వం ఏదైనా పథకం కింద డబ్బులు ఇస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు.
సెంటు స్థలం ఇళ్ల పేరుతో లక్షల అప్పుల ఊబిలోకి పేదలు !
ముఫ్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలంటూ.., ప్రభుత్వం ఎంత హడావుడి చేసిందో అందరం చూశాం. కనీసం రూ. పదిహేను వేల కోట్లు పెట్టి.. పనికి రాని స్థలాలను వైసీపీ నేతల వద్ద నుంచే కొనుగోలు చేశారు. చివరికి మడ అడవుల్ని కూడా కొట్టేశారు. ఎన్జీటీ రూ. ఐదు కోట్ల ఫైన్ వేసింది. అవన్నీ పక్కన పెడితే.. ఇప్పుడు పేదలను ఆ ఇళ్ల పేరుతో లక్షలకు లక్షలు అప్పుల పాలు చేస్తోంది ప్రభుత్వం. ఇచ్చేది సెంటు భూమి. అంటే 30 గజాలు మాత్రమే. అందులో ఎంత ఇల్లు వస్తుందో కనీస అవగాహన ఉన్నవారికైనా తెలుస్తుంది. ఇప్పుడు ఇచ్చి స్థలాల్లో ఇల్లు కట్టుకోవాలని లబ్దిదారుల్ని బెదిరిస్తున్నారు. ఈ ఇళ్ల కోసం కేంద్రం ఇచ్చే రూ. లక్షా ఎనభై వేలును మాత్రమే రాష్ట్రం ఇస్తోంది. అంతే కానీ సొంతంగా రాష్ట్రం పైసా ఇవ్వడం లేదు. స్థలం ఇచ్చాం కదా అంటోంది. ఈ రోజుల్లో రూ. లక్షా ఎనభై ఐదు వేలకు.. పునాదులు కూడా వేయలేరు. ఎంత చిన్న స్థలం అయినా.. వాటికి గ్రౌండింగ్‌కు ఖర్చు అవుతుంది. ఇల్లు ఎంత సాదాసీదాగా కట్టుకోవాలన్నా మరో మూాడు, నాలుగు లక్షల ఖర్చు అవుతుంది. పేదలందర్నీ ఇళ్లు కట్టుకోకపోతే ఇచ్చిన స్థలం కూడా క్యాన్సిల్ చేస్తామని బెదిరించి.. ఎక్కడెక్కవన్నీ అప్పులు చేసి మరీ ఇల్లు కట్టుకునేలా చేస్తున్నారు. ఇలా స్థలాలు పొందిన లబ్దిదారుల్లో లక్షల మంది ఇప్పటికే లక్షల రూపాయల అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటున్నారు. ఇందులో విషాదం ఏమిటంటే.. ప్రభుత్వమే డ్వాక్రా పేరుతో రూ. ముఫ్పై ఐదు వేలు లోను ఇప్పించడం.. దాన్ని కూడా లబ్దిదారులకు ఇవ్వకుండా.. ఇంటి నిర్మాణ కాంట్రాక్టర్లు అంటూ.. వైసీపీ నేతలకే మళ్లించడం. ఇప్పుడు ప్రజలకు ఇల్లు లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. వారి నెత్తి మీద లక్షల అప్పు ఉంది. ఇక టిడ్కో ఇళ్ల లబ్దిదారుల్ని ఎంతగా వంచించాలో అంతగా వంచించారు. గత ప్రభుత్వం నిర్మాణం పూర్తయిన ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా పాడుబెట్టారు. ఇప్పుడు లబ్దిదారులకు లోన్లు ఇస్తేనే వాటిని ఇవ్వడానికి సాధ్యమవుతుంది. ఇళ్ల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు .. ఓటీఎస్ పేరుతో దోచుకోవడమే కాకుండా.. టిడ్కో ఇళ్ల పేరుతో లబ్దిదారుల్ని మరితంగా అప్పుల పాలు చేస్తున్నారు. వారి పేరుతో రూ. కోట్లు బ్యాంకుల నుంచి తీసుకుంటున్నారు కానీ పనులు జరగడం లేదు. ఇప్పుడు లబ్దిదారులకు అటు ఇల్లు రాలేదు.. ఇటు అప్పుల పాలయ్యారు.
రేషన్ బియ్యాన్నీ సక్రమంగా దక్కకుండా చేస్తున్నారు !
పేదలు రేషన్ బియ్యం మీదే ఎక్కువ ఆధారపడుతున్నారు. జగన్‌సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం తినే వారిసంఖ్య పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. సన్నబియ్యం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. చివరికి ఎప్పట్లానే ఇస్తోంది. ఈ బియ్యం పేదలకు అందడమే గగనం అయింది. రేషన్ డీలర్ల దగ్గర్నుంచి ఇంటింటికీ రేషన్ సరఫరా పేరుతో వాహనాలకు ఎక్కించి..వారి దగ్గర్నుంచి బియ్యం మాఫియాకు తరలిస్తున్నారు. లబ్దిదారులకు కేజీకి రూ. పది చొప్పున ఇచ్చి సరి పెడుతున్నారు. గతంలో అధికారంగా ప్రభుత్వమే ఇలా ఇవ్వాలని అనుకుంది. తర్వాత మనసు మార్చుకుంది. కానీ పథకాన్ని మాత్రం.. అమలు చేసేస్తున్నారు. ఇలా పేదలకూ రేషన్ బియ్యం అందకుండా పక్కదారి పట్టిస్తున్నారు. చెత్త పన్నులు, ఆస్తి పన్నులు ఇలా ప్రతి ఒక్క పన్నలు పెంచారు. వందల కోట్లను వసూలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే ఏపీలో ఎక్కువ. ఎక్కువ పేదలు ఉన్నది కూాడ ఏపీలోనే. అలాంటప్పుడు తక్కువ ధర ఉండాలి. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజల్ని పన్నుల రూపంలో పీడించేసి వసూలు చేస్తోంది. చెత్త పన్నుల వసూలు కోసం .. ప్రభుత్వం చేస్తున్న విన్యాసాలు చూసి.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిత్యావసరాల వస్తువుల బడ్జెట్.. ఏడాదిలో రెట్టింపయింది. కానీ ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదు. ఓ వైపు ఉపాధి తగ్గిపోవడం.. మరోవైపు పన్నుల మోతతో.. ఎవరికీ ఊపిరిఆడకుండా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దిగువ మధ్యతరగతి ప్రజల బతుకులు బాగుపడ్డాయి. కానీ ఏపీ పేదల పరిస్థితే దిగజారింది. దీనికి ద్విచక్రవాహనాల అమ్మకాలు దారుణంగా పడిపోవడమే సాక్ష్యం.
పేదలు ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎదురు చూసే పరిస్థితి తెవడేమే లక్ష్యం.. తెచ్చేశారా?
ముందుగా చెప్పుకున్నట్లుగా పేదలు.. ముఖ్యంగా ఓటు బ్యాంకుల్ని పూర్తిగా నిరుపేదల్ని చేసి వారికి మరో ఆప్షన్ లేకుండా ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎదురు చూసేలా చేసి .. రెండు ముద్దలు పెట్టి ఆకలి తీర్చే.. తామే దేవుళ్లమని.. తాము లేకపోతే.. ఆ రెండు ముద్దలు కూడా దక్కవని భయపెట్టడమే ప్రస్తుత రాజకీయ లక్ష్యం. పరిస్థితి చూస్తేూంటే.. మూడున్నరేళ్లలోనే ప్రభుత్వం ఆ లక్ష్యం సాధించినట్లుగా కనిపిస్తోంది. పేదలు ఇప్పుడు పథకాల కోసం ఎదురు చూసి.. తమకు ప్రభుత్వం ఇచ్చే … కొద్ది మొత్తంతో ప్రభుత్వమే సృష్టించిన ఖర్చులకు వెచ్చించి.. సంతోషఫడాల్సి వస్తోంది. అదనంగా ప్రభుత్వమే .. దింపిన ఉప్పుల ఊబి నుంచి బయటపడటానికి మరో ఆలోచన చేయడానికి అవకాశం లేకుండా చేసేశారు. ఫ్యాక్షన్ మార్క్ రాజకీయం ఇప్పుడు ఏపీ పేదల్ని నిలువునా ముంచేసింది.
ఎవరైనా ఓటు బ్యాంక్‌కు మంచి చేసి..మరింత పాజిటివ్ ఓటు తెచ్చుకోవాలనుకుంటారు.. కానీ ఇది ఔట్ డేటెడ్ రాజకీయం. ఓటు బ్యాంకును దివాలా తీయించి.. రెండు ముద్దలు వారికి పెట్టి.. వారికి మేలు చేస్తున్నట్లుగా నటించడం ద్వారా.. వారిని తిరుగులేని ఓటు బ్యాంక్‌గా మార్చుకోవడమే నయా రాజకీయం. దీని వల్ల పేదలు బికారులవుతారు.. కానీ వారిని ఆ స్థితికి తెచ్చినవారు మాత్రం.. తిరుగులేని ధనవంతులవుతారు. ఏపీలో అదే జరిగింది. పాపం.. ఏపీ పేదలు..!