ఆంధ్రప్రదేశ్లో పై చదువులు చదువుకోవాలంటే ప్రతి ఒక్కరి చాయిస్ పొరుగు రాష్ట్రాలే. ఆ ఉన్నత చదువులు ఇంటర్ నుంచే ప్రారంభమవుతున్నాయి. ఇంటర్ కూడా ఏపీలో వద్దు మహా ప్రభో అనుకుని పొరుగు రాష్ట్రాల్లో హాస్టల్స్ అయినా వేసేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇంజీనిరింగ్ సంగతి చెప్పాల్సిన పని లేదు . తెలంగాణలో ఎంసెట్ పెడితే ర్యాంకులన్నీ ఏపీ వాళ్లకే వచ్చాయంటే… ఏ స్థాయిలో రాస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లు భర్తీ కావడం గగనంగా మారింది. హైదరాబాద్కు దగ్గరగా ఉన్నవారు హైదరాబాద్కు.. బెంగళూరుకు దగ్గరగా ఉన్నవారు బెంగళూరు.. చెన్నైకు దగ్గరగా ఉన్న వారుచెన్నైకు వెళ్లిపోతున్నారు.
చదువులు, ఉద్యోగం కోసం చలో చలో !
పూర్తిగా చదువులో వెనుకబడిన వారో.. ఇత చోట్లకు వెళ్లి చదువుకోలేని నిరుపేదలు మాత్రం .. తప్పనిసరిగా ఏపీకే పరిమితమవుతున్నారు. వారికి అందుతున్న విద్యా సౌకర్యాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. విద్యా సౌకర్యాలే అంతంత మాత్రంగా ఉంటే ఇక ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి ? గత నాలుగేళ్లలో ఏ కంపెనీ వచ్చిందని ఉద్యోగాలిస్తాయి ? ఉన్న కంపెనీలను వెళ్లగొట్టడంతో ఇతర రాష్ట్రాలకు వలసపోయేవాళ్లే ఎక్కువ. అమరావతి ఆగిపోవడంతో అక్కడ పని చేసే యాభై వేల మంది పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇక కొత్తగా చదువులు పూర్తయ్యే వారు హైదరాబాద్, చెన్నై, బెంగళూరును పట్టుకుని ఆశల జీవితాలను అక్కడ వెదుక్కుంటున్నారు.
షాపింగ్ కోసం చలో చలో !
చదువులు,, ఉద్యోగాల కోసం మాత్రమే కాదు.. చివరికి షాపింగ్ చేయాలన్న ఈ నగరాలకే వెళ్లిపోతున్నారు జనం . ఏపీలో వ్యాపార ప్రోత్సాహక పరిస్థితులు లేకపోవడంతో అన్ని రకాల వ్యాపారాలు డీలా పడ్డాయి. అమ్మకాలు తగ్గిపోయాయి. అదే సమయంలో ఏపీలో షాపింగ్ చేయడానికి కూడా జనం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే రేట్లు ఎక్కువ. హైదరాబాద్లో రూ. వందకు వచ్చే వస్తువు ఏదైనా ఏపీలో నూటయాభై వరకూ వసూలు చేస్తారు. ఎందుకంటే… వారు కట్టుకోవాల్సిన టాక్సులు ఎన్ని ఉంటాయో. ఇంట్లో ఏదైనా శుభకార్యం అయినా.. మరో అకేషన్ అయినా .. చుట్టుపక్కన మెట్రో నగరాలకు వెళ్లి మాల్స్ లోనే … షాంపింగ్ మాల్స్ లోనే కొనుగోలు చేసి ఏపీకి వస్తున్నారు కానీ.. ఏపీలో వ్యాపారస్తులకు బేరం ఇద్దామనే ఆలోచనలు తగ్గించుకుంటున్నారు.. ఎందుకు నష్టపోవాలని కాస్త దూరమైన వెళ్లి షాపింగ్ చేసుకుని వచ్చి డబ్బులు మిగిల్చుకుంటున్నారు.
చివరికి మద్యం తాగేందుకూ పొరుగురాష్ట్రాలకే చలో చలో !
ఈ వలసాంధ్రలో ట్విస్ట్ ఏమింటే… మద్యం తాగడానికీ వలస పోవడం. మద్యం తాగే అలవాటు ఉన్న రోజువారీ కూలీ చేసే నిరుపేదలు.. తప్పనిసరిగా ప్రభుత్వ బ్రాండ్లను తాగేస్తారు. కానీ అవి తాగలేని వారు… వారాంతాల్లో పొరుగు రాష్ట్రాలకు టూర్లు వేస్తున్నారు . సరిహద్దులకు ఇంకా దగ్గరగా ఉంటే..రెగ్యులర్ గా వెళ్లివస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ మద్యందుకాణాల్లో అమ్మకాలు హైదరాబాద్ దుకాణాల రేంజ్ లో ఉంటున్నాయంటే.. ఇంక చెప్పడానికేమి ఉంటుంది ?