సులభతర వ్యాపారానికి, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ, తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచాయని ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు సంతోషపడ్డారు. రెండు రాష్ట్రాలకూ ఒకే ర్యాంక్ రావడం మరో విశేషం. ఈ ర్యాంకుల వెనకే మరో విధమైన ర్యాంకులు విడుదలయ్యాయి. వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
దేశంలో రైతులకు అత్యంత అనుకూలమైన విధానాలు అనుసరించే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఫార్మర్ ఫ్రెండ్లీ రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. రైతు అనుకూల విధానాల అమలులో ఆ రాష్ట్రం 81.7 శాతం మార్కులు సాధించింది. రెండో స్థానంలో ఉన్న గుజరాత్ 71.5 శాతం సాధించింది. రాజస్థాన్ 70 శాతంతో మూడో ర్యాంక్ పొందింది. 69.5 శాతంతో మధ్య ప్రదేశ్ నాలుగో స్థానం దక్కించుకుంది. 63.3 శాతంతో హర్యానా ఐదో ర్యాంకు పొందింది. ఏపీ 7, తెలంగాణ 8వ ర్యాంకు పొందాయి. టాప్ 5లో ఉన్నవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం విశేషం.
నీతి ఆయోగ్ జాబితా ప్రకారం రైతు అనుకూల రాష్ట్రాల జాబితాలో పుదుచ్చేరి అట్టడుగున ఉంది. చివరి ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వరుసగా మేఘాలయ, లక్షద్వీప్, జమ్ము కాశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి ఉన్నాయి.
పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, బెంగాల్, అసోం, జార్ఖండ్, తమిళనాడులు కనీసం 50 శాతం మార్కులు పొందలేకపోయాయి. రైతులకు మేలు చేసే సంస్కరణలను అమలుచేయడం, వ్యవసాయ మార్కెటింగ్ తదితర సదుపాయాల కల్పనలోమెరుగ్గా ఉండటం వంటి అంశాల ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. దేశంలో ఇలా వ్యవసాయ రంగంలో రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వడం ఇదే మొదటిసారి.