తెలంగాణ ఎంసెట్ ఫలితాలను ప్రభుత్వం ప్రకటించింది. మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నీట్ పరీక్ష ఉండటంతో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సీట్ల భర్తీ కోసమే ఎంసెట్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎసెంట్లో టాపర్లు అందరూ ఏపీకి చెందిన వారే. మొత్తం టాప్ టెన్ ర్యాంకుల్లో ఒక్క విద్యార్థి మాత్రమే నల్లగొండకు చెందిన వారు. ఏడో ర్యాంక్ శాశ్వితా రెడ్డి మాత్రమే నల్లగొండ.. మిగతా అందరూ ఏపీకి చెందినవారే. అగ్రికల్చర్ ర్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. అగ్రికల్చర్, మెడికల్ ర్యాంకుల్లో ముగ్గురు హైదరాబాద్కు చెందిన వారు కాగా.. మిగతా ఏడుగురు ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు.
గతంలోనూ తెలంగాణ ఎంసెట్ లో ఏపీ విద్యార్థులు రాసేవారు కూడా ఇంత ఉద్ధృతంగా అంతా వారే ఉండేవారు కాదు. కానీ ఏపీలో చదువుకునే పరిస్థితులు లేకపోవడంతో.. వీలైనంత మంది హైదరాబాద్ ఆ చుట్టుపక్కన ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఐఐటీ వంటి చోట్ల సీట్లు రాకపోతే.. హైదరాబాద్ లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరిపోవడానికి ఇలా రాస్తున్నారని చెబుతున్నారు. ఏపీలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో కొన్ని మినహా మిగతావన్నీ ప్రభుత్వ విధానాల కారణంగా .. మెరుగైన వసతులు కల్పించలేక.. అరకొర ఫీజులు..అవి కూడా విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ చేయడం ఆలస్యం కావడం తల్లుల ఖాతాల్లో వేస్తున్న నగదు కాలేజీల్లో జమ కాకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
అదే సమయంలో అక్కడి రాజకీయ పరిస్థితుల కారణం కాలేజీలు కూడా డిస్ట్రబ్ అవుతున్నాయి. ప్రతీ సభకు విద్యార్థుల్ని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి కారణాల వల్ల ఉన్నత విద్య కోసం ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లలో ప్రముఖ ప్రైవేటు యూనివర్శిటీల్లో చేరే వారిలో ఏపీ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని లెక్కలు చెబుతున్నాయి.