ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితం.. ఎవరూ ఊహించనిది. ఏకపక్షంగా సీట్లు వేశాయనుకున్న ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా… 130 సీట్లు వరకే… వైసీపీకి కట్టబెట్టాయి. కానీ… వైసీపీ అనూహ్యంగా… 150 దాటిపోయింది. దాంతో.. అటు రాయలసీమలో కానీ… ఇటు కోస్తాలో కానీ… చివరికి ఉత్తరాంధ్రలో కూడా.. టీడీపీ పరువు నిలుపులేకపోయింది. అసలెందుకిలా జరిగింది..?
నేతల అవినీతిపై ఉత్తరాంధ్రలో వ్యతిరేకత..!
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఉన్న 34 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ 27 సాధించింది. కానీ ఈ సారి మాత్రం… కేవలం ఆరు స్థానాలకు పరిమితయిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ ఎంతటి దారుణ ఫలితాలను చూసిందో.. ఇప్పుడు టీడీపీ అంత కంటే ఎక్కువ ఘోరపరాజయాన్ని చదవి చూసింది. 10 నియోజకవర్గాలున్న శ్రీకాకుళం జిల్లాలో.. వైసీపీ ఎనిమిది చోట్ల విజయం సాధించింది. టెక్కలిలో అచ్చెన్న, టీడీపీకి కంచుకోట లాంటి ఇచ్చాపురంలో అశోక్ మాత్రమే విజయం సాధించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సహా పలువురు నేతలు పరాజయం పాలయ్యారు. విజయనగరం జిల్లాలో మొత్తం వైసీపీనే స్వీప్ చేసింది. విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు, వైరిచర్ల వంశీయులు అందరూ కలిసిపోయినా… ఒక్క బొత్స లాంటి నేతను పట్టుకుని… వైసీపీ ఘన విజయం సాధించింది. విశాఖ జిల్లాలో విశాఖ సిటీలో ఉన్న నాలుగు స్థానాలు తప్ప.. అన్ని చోట్లా టీడీపీ ఓటమి పాలయింది. ఇంత ఘోర పరజయాన్ని.. టీడీపీ ఊహించలేదు. ప్రభుత్వంపై ఇంత తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణం.. కేవలం.. అక్కడి నేతల… వ్యవహారశైలి.. అవినీతేనన్న చర్చ జరుగుతోంది.
కోస్తాలోనూ ప్రజలు మెచ్చలేదు..!
పట్టిసీమతో నీళ్లిచ్చాం…! అమరావతిని నిర్మిస్తున్నాం..! అంటూ… గొప్పగా అభివృద్ధి చేస్తున్నాం అంటూ… టీడీపీ నేతలు హడావుడి చేశారు కానీ.. కోస్తా ప్రజలు మాత్రం… ఓట్లు వేయలేదు. ఉభయగోదావరి జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా వరకూ… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర సాగించింది. తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలుంటే… నాలుగు చోట్ల మాత్రమే విజయం సాధించగలిగారు. ఒక్క చోట జనసేన అభ్యర్థి విజయం సాధించారు. మిగతా అన్ని చోట్ల వైసీపీదే ఆధిపత్యం. పశ్చిమగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క సీటు రాని వైసీపీ.. ఈ సారి టీడీపీకి రెండు చోట్ల మాత్రమే చాన్సిచ్చింది. దెందులూరులో చింతమనేని కూడా ఓడిపోయారు. ఇక టీడీపీ గట్టి పట్టు అని చెప్పుకున్న కృష్ణా జిల్లాలో కూడా టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. అతి కష్టం మీద విజయవాడ ఈస్ట్, గన్నవరంలో మాత్రం టీడీపీ అభ్యర్థులు గెలిచారు. గుంటూరు జిల్లాలోనూ అదే పరిస్థితి . చివరికి లోకేష్ కూడా పరాజయం పాలవ్ాల్సి వచ్చింది. ఓటమి ఎరుగని ధూళిపాళ్లకూ అదే పరిస్థితి. ఏ రాజధాని సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. ప్రకాశం జిల్లాలో మాత్రం… టీడీపీ.. కాస్త చెప్పుకోదగ్గ విజయాలు నమోదు చేసింది. ఆమంచి కృష్ణమోహన్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు లాంటి వాళ్లను ఓడించారు. ఇక కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో… వైసీపీ స్వీప్ చేసింది.
రాయలసీమలో జై జగన్..!
జగన్ను రాయలసీమ తమ బిడ్డగా దగ్గరకు తీసుకుంది. చంద్రబాబు కూడా రాయలసీమ వాసి అయినప్పటికీ.. ఆయనను కనీసం సొంత జిల్లా కూడా ఆదరించలేదు. మొత్తం రాయలసీమలో… టీడీపీ మూడు సీట్లకే పరిమితమయింది. కుప్పం, ఉరవకొండ, హిందూపూర్ మాత్రమే… టీడీపీ ఖాతాలో పడ్డాయి. మిగతావి అన్ని భారీ మెజార్టీలతో… వేసీపీ ఖాతాలో పడ్డాయి. రాయలసీమ ప్రజల్లో… అమరావతిపై.. ఓ రకమైన కోపం ఉందన్న ప్రచారం ఉంది. అభివృద్ధి అంతా అక్కడే చేస్తున్నార్న అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని అంటున్నారు. అంతా ఓ వర్గ అభివృద్ధి కోసమే అన్నట్లుగా… ప్రచారం జరగడంతో… ఆ ప్రభావం టీడీపీపై కనిపించింది. తమ జిల్లా వాడు సీఎం కావాలన్న లక్ష్యం.. కడప వాసుల్లో కనిపించింది.