ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన మూడవ అతిపెద్ద( 11% వాటా) ఆదాయాన్ని ఆర్జించే విభాగం రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల విభాగం. 1864 సంవత్సరం నుండి పనిచేస్తున్న పురాతన శాఖ ఆస్తులకు రిజిస్టర్డ్ పత్రాల ద్వారా హక్కు కల్పించి రక్షించడం, ఈ శాఖ యొక్క లక్ష్యం. ఒక డాక్యుమెంట్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ప్రపంచానికి ఖచ్చితమైన నమోదు చేయబడిన సమాచారం ద్వారా ప్రజలకు ఒక నోటీసు, తద్వారా ప్రజలు రికార్డులను ధృవీకరించడానికి మరియు ఏదైనా స్థిరాస్తిపై హక్కు, టైటిల్ మరియు బాధ్యతలను విచారించడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా, పురాతన రికార్డులను భద్రపరచడం ద్వారా మరియు న్యాయస్థానంలో సాక్ష్యంగా అందించడానికి దాని వద్ద ఉన్న రికార్డుల కాపీలను భద్రపరచడం ద్వారా ఈ విభాగం “రాయల్ రికార్డ్ కీపర్”గా వ్యవహరిస్తోంది. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా ఈ విభాగం రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సేకరిస్తోంది. కానీ ప్రస్తుత రిజిస్ట్రార్ కార్యాలయాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అనేక కార్యాలయాలు అద్దె భవనాలలో కనీస సౌకర్యాలు కూడా లేకుండా కొనసాగుతున్నాయి. విజయవాడ నగరంలో అత్యధిక రిజిస్ట్రేషన్లు జరుగే ఒక కార్యాలయము అయిన పటమట రిజిస్టర్ ఆఫీసులో కనీసం త్రాగునీరు కూడా లభించడం లేదు.. ఉన్న ఫ్యాన్లు కుడా పెద్ద శబ్దం చేస్తూన్న పరిస్థితి.
బ్రిటిష్ కాలం నుండి కొనసాగుతున్న ఈ వ్యవస్థను ఇప్పటికీ కొనసాగించడం బాధాకరం. స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఈ శాఖ పై దృష్టి సారించడం శుభపరిణామం. పోలీస్, జ్యూడిషరీ మరియు రెవిన్యూ వ్యవస్థలు కూడా అప్‌గ్రేడ్ అవ్వకపోవడం బాధాకరం… రాష్ట్రం విడిపోతున్న సమయంలో, ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రవిభజనకు వ్యతిరేకంగా దేశసర్వో న్నత న్యాయస్థానం తలుపు తడితే ఆ కేసు బెంచ్ మీదకు జూలైలో వచ్చిన పరిస్థితి. జూన్ 2 నాటికే రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన పరిస్థితి. అదే సుప్రీమ్ కోర్ట్ కు రఘురామకృష్ణరాజు రెండు మూడు జిల్లాల ప్రజలకు వినోదం అయిన కోళ్ళపందాల విషయంలో 2015 జనవరిలో కోర్టుకు వెళితే న్యాయస్థానం వెంటనే స్పందించి 48 గంటలలో తీర్పు ఇచ్చింది. కోర్టులను ఏమీ అనలేము కానీ ఈ వ్యవస్థలో మార్పులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. అలాగే పోలీసు వ్యవస్థలో కూడా సంస్కరణలు ప్రజలు కోరుకుంటున్నారు.
పట్వాడ భూములు, కామన్ సైట్స్ అన్యాక్రాంతం కావడానికి గల కారణాలను గుర్తించి, ప్రభుత్వ భూములను కాపాడటానికి చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక రిజిస్ట్రార్ కార్యాలయాలను జోన్ కి ఒకటి చొప్పున ఏర్పాటు చేయడం వలన కొంతవరకు ల్యాండ్ గ్రాబింగ్ తగ్గవచ్చు. ఉదాహరణకి మా గన్నవరం నియోజక వర్గములో చాల కామన్ సైట్ లు అన్యాక్రాంతం అయిన పరిస్థితి.
ప్రభుత్వం అత్యధిక పన్ను చెల్లించేవారికి కనీస విలువ, మర్యాద కల్పించాలి. యూజర్స్ చార్జెస్ దస్తావేజుకు 500/- రూపాయలు కొనుక్కున్న వారి నుండి వసూలు చేస్తున్న పరిస్థితి కాదనలేని నిజం. వసూలు చేసే యూజర్ ఛార్జీలు పూర్తిగా రిజిస్ట్రేషన్ శాఖ యొక్క ప్రయోజనం కోసం ఉపయోగించుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. దస్తావేజు రైటర్స్ కాన్సెప్ట్ బదులు ప్రత్యామ్న్యాయ పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ చేయగలిగితే రిజిస్ట్రేషన్ సమయంలో దళారీల పాత్రను తగ్గించవచ్చు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. డాక్యుమెంట్ రైటర్లు దస్తావేజు రాసినన్నాళ్ళు రూల్స్, శిక్షలు మార్చాల్సిన అవసరం ఉంది. పూర్వం లాగే డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
రిజిస్ట్రేషన్ సేవలు పొందే సమయంలో రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రోడ్ల మీద వేచి ఉండటం, ఎండలో, వానలో ఇబ్బంది పడటం ప్రజలకు కష్టంగా ఉంది. తక్షణం కనీస సౌకర్యాలను పెంచి, పన్ను చెల్లించేవారిని గౌరవించాలి. రాష్ట్ర ఆదాయంలో ముఖ్య పాత్ర పోషించే ఎస్ఆర్ఓ ఆఫీసులను మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్రానికి నిర్దిష్ట AP స్టాంప్ చట్టం అవసరం. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తమ రాష్ట్ర చట్టానికి సవరణ ద్వారా అదనపు ఆదాయాన్ని సేకరించడానికి వారి స్వంత స్టేట్ స్టాంప్ చట్టాన్ని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, ప్రతి రిజిస్ట్రేషన్ కి ఆవు రక్షణ నిధికి కట్టే స్టాంప్ డ్యూటీ పై 10% సెస్ సేకరించడానికి రాజస్థాన్ వారి స్టాంప్ చట్టాన్ని సవరించారు. కానీ మనం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అమలు చేస్తున్నాము, ఎందుకనగా, ఇండియన్ స్టాంప్ చట్టం 1899 కాబట్టి పార్లమెంటు అనుమతి లేకుండా మేము సవరించలేకపోతున్నాము అని రిజిస్ట్రేషన్ శాఖ చెపుతుంది. ఈ సందర్భంలో, ప్రభుత్వం దీనిపై సమీక్షించాలి మరియు ప్రగతిశీల AP కోసం కొత్త స్టాంప్ చట్టాన్ని తీసుకురావాలి.
రాష్ట్ర ఖజానాకి భవిష్యత్తులో సంవత్సరానికి అదనంగా దాదాపు 1000 కోట్లు రాబడి తేవాలంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు నిర్దిష్ట స్టాంప్ చట్టం అవసరం. రాష్ట్ర ఖజానాకు అదనపు ఆదాయం కోసం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలంటే ఇండియన్ స్టాంప్ యాక్ట్ కు బదులుగా AP స్టాంప్ చట్టం తీసుకుని రావలసిన ఆవస్స్యకత చాల ఉంది, కానీ ప్రభుత్వాలు ఇది ప్రజలపై అదనపు భారం అని భావిస్తున్నాయి. స్టాంప్ చట్టం ఆర్థిక చట్టం అని సుప్రీంకోర్టు చెబుతోంది. కొత్త ఆదాయాన్ని వసూలు చేయడానికి స్టాంప్ యాక్ట్ కోసం ఏదైనా సవరణ చేస్తే అది ప్రజలపై పన్ను భారం కింద భావించరాదు. అట్లాగే కొత్త భవన నిర్మాణాలకు యూజర్ చార్జీలు కింద వసూలయ్యే మొత్తంలో కొంత వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్టంలో మొత్తం రిజిస్ట్రార్ కార్యాలయాలు 294 లలో దాదాపు సగం భవనాలు అద్దె భవనాలలో ఉన్న పరిస్థితి. రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్న ప్రభుత్వ భవనాలు కుడా శిధిలమైన స్తితిలో ఉన్న పరిస్థితి . అద్దె భవనాలు కూడా సరైన సౌకర్యాలతో సక్రమంగా లీజుకు తీసుకోలేదు. అలానే రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగాలు 2500కు గానూ ప్రస్తుతం షుమారు 1800 మాత్రమే ఉన్నారు, ఉద్యోగుల కొరత కారణంగా SRO ఆఫీసులలో ప్రైవేట్ మరియు అనధికారిక వ్యక్తులు పెరుగుతున్నారు. స్కానింగ్, KYC ఆధార్ సీడింగ్ మొదలైన వాటి కోసం ప్రైవేట్ వారిపై ఆధారపడవలసి వస్తోంది. SRO కార్యాలయాలు అలాట్మెంట్ ప్రకారం ఉండవలసినంత సిబ్బందితో పనిచేయడం లేదు. ఈ అలాట్మెంట్ కుడా చాలా కాలం క్రితం నిర్ణయించబడింది మరియు ప్రస్తుత కార్యకలాపాలకు ఈ అలాట్మెంట్ సరిపోవడం లేదు. అడ్వాన్స్డ్ కంప్యూటర్లు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వలన ఉన్న కొద్దిపాటి సిబ్బంది కుడా ప్రజల అవసరాలను తీర్చడానికి నూతన టెక్నాలజీలలో సరియిన శిక్షణ పొందలేదు. చిన్న చిన్న సర్వర్ సమస్యల కోసం ప్రైవేట్ కాంట్రాక్టర్లపై ఆధారపడటం సమస్యగా మారుతోంది, దీని ద్వారా రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన సాధారణ ప్రజలకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి. చాలా మంది సిబ్బంది కారుణ్య ప్రాతిపదికన నియమించబడ్డారు కాని చాలా కాలం నుండి క్రింది స్థాయిలో ప్రత్యక్ష నియామకం జరగడం లేదు. వారికి సరిఅయిన శిక్షణ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నియామకం ద్వారా లేదా APCOS ద్వారా భారీ ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. ఇది SRO లో ప్రజల యొక్క సగటు నిరీక్షణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఇది అత్యధిక ఆదాయం ఆర్జించే శాఖలలో ఒకటి అయినప్పటికీ, ఇతర ఆదాయం ఆర్జించే శాఖలతో పోలిస్తే పరిమిత సంఖ్యలో ఉద్యోగులు ఉన్నప్పటికీ, 1999 లో మన దార్శనిక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన CARD వ్యవస్థ కారణంగా కంప్యూటరీకరణ తో చాల అభివృద్ధి చెందింది. మారుతున్న కాలానికి అనుగుణంగా, ముఖ్యంగా సాధారణ ప్రజలకు సేవ చేసే R&S వంటి విభాగంలో ఈ పరిణామం అత్యంత అవసరం. కానీ ఈ విభాగం పలు సవాళ్ల కారణంగా ప్రజలకు సరైన రీతిలో సేవలకు అంతరాయం కలుగుతున్న పరిస్థితి.
ఈ- స్టాంప్: ఈ- స్టాంప్ విధానం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. స్టాంప్‌ల కొరత, నకిలీ స్టాంప్‌ల విక్రయం, ట్యాంపరింగ్.. వంటి సమస్యలకు ఈ-స్టాంప్ చెక్ పెడుతుందంటున్నారు అధికారులు. నాన్ జ్యుడిషియల్‌కు ఉన్న చట్టబద్ధత ఈ- స్టాంపునకూ ఉంటుంది. స్టాంప్ వెండర్లతో పాటు కామన్ సర్వీస్ సెంటర్లలో ఈ-స్టాంప్‌లు అందుబాటులో ఉంటాయి. తమకు ఎంతో కొంత కమిషన్ వచ్చేలా చూస్తే కొత్త విధానం ఎంతో బాగుంటుందని స్టాంప్ వెండర్లు చెబుతున్నారు. స్టాంప్ పేపర్ల తయారీ ఖర్చు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముంది.
నకిలీ చలానాల కుంభకోణం: గత ప్రభుత్వ హయంలో రిజిస్ట్రేషన్ శాఖలో చోటుచేసుకున్న చలనాల కుంభకోణాన్ని ఛేదించే క్రమంలో ఆశ్చర్యగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చినవి. ముఖ్యంగా నకిలీ చలానాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వెలుగుచూసిన ఈ కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో 2018నుంచి ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసిన చలాన్లపై అధికారులు పరిశీలించి… దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. 2021 జనవరి నుంచి నకిలీ చలానాలతో మోసం జరిగినట్లు గుర్తించారు.
ప్రజల వెసులుబాటు కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన సీఎంఎఫ్ఎస్ విధానం అక్రమార్కులకు అందివచ్చిన అవకాశంగా మారింది. ఈ విధానంలో కంప్యూటర్ ద్వారా వచ్చే చలానాలపై అధికారుల ధ్రువీకరణ సంతకాలు, సీళ్లు ఉండవు. నకిలీ చలానాలు సృష్టించడానికి ఇది మొదటి లోపంగా మారింది. చలానా కట్టిన అనంతరం రిజిస్ట్రేషన్ చెల్లింపు మొత్తాన్ని ఎడిట్ చేసుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్రమార్కులు వాడుకున్నారని ప్రచారం జరుగుతోంది.
కడప జిల్లాలో మొట్టమొదటి సారిగా వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణం… రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రైటర్స్‌గా పనిచేసిన వ్యక్తులే ప్రభుత్వాదాయానికి గండి కొట్టారని తేల్చిన పోలీసులు… కొద్ది కాలంలోనే కోట్లాది రూపాయలకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని గుర్తించారు. ప్రతి రూపాయీ ప్రభుత్వానికి తిరిగి చెల్లించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా మండవల్లి, నెల్లూరు జిల్లా నాయుడుపేట, పశ్చిమగోదావరి జిల్లా తణుకు, కర్నూలు జిల్లా నంద్యాల గుంటూరు జిల్లా మంగళగిరి, విజయవాడ గాంధీనగర్, విశాఖ జిల్లా లంకెలపాలెం వంటి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, నకిలీ చలానాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
జగన్ ప్రభుత్వ ప్రయోగాలు రివర్స్, రిజిస్ట్రేషన్లు తిప్పలు ..
గత ప్రభుత్వంలో ప్రయోగాత్మకంగా సచివాలయాల్లో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామ సచివాలయాల ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్లుకు వైసీపీ ప్రభుత్వం కొత్త ప్రయోగాలు చేపట్టింది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కాకుండా గ్రామ సచివాలయంలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, ఇక ప్రజల కష్టాలు పూర్తిగా తీరిపోతాయని ప్రజలకు చెప్పింది. సచివాలయ ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వకుండా, సచివాలయాల్లో అరకొర సదుపాయాలు కల్పించి గ్రామ సచివాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. అయితే అప్పట్లో వైయస్ జగన్ చేపట్టిన ప్రయోగాలకి గ్రామ సచివాలయంలోని ఉద్యోగులపై ఒత్తిడి తప్ప ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రయోగం ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. గత రెండున్నర ఏళ్ల కాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలం 110 ఆస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లను పూర్తిగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల విభాగంలో లోపాలను, లొసుగులను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు తమ ఆస్తి పట్ల బద్రతా భావాన్ని బరోసాని కల్పించి, కనీస సౌకర్యాలు మెరుగుపరచి, రాష్ట ముఖ్య ఆదాయ వనరు అయిన ఈ శాఖ ను ఈ మంచి ప్రభుత్వం సంస్కరిచగలదు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు …సుదీర్గ అనుభవం ఉన్న పాలనాదక్షుడు చంద్రబాబుకి ఆంధ్రావని పట్టం కట్టి పట్టాభిషేకం చేసింది. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల అనేక మంది బాధితులు వాళ్ళ ఆస్తులను కాపాడుకోలేక రెవెన్యూ సదస్సులలో ఫిర్యాదులు చేసిన పరిస్థితిని రాష్ట్ర వ్యాప్తంగా చూసాము..ఈ పిర్యాదులను రెవెన్యూ సదస్సుల ద్వారా ఈ మంచి ప్రభుత్వం పరిష్కరిస్తున్నది. 294 రిజిస్టర్ కార్యాలయాలలో అద్దె భవనాలలో ఉన్న కార్యాలయాలను ప్రభుత్వ స్థలాలలో కట్టి , ఉద్యోగుల కొరత లేకుండా , ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించవలిసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడవలిసిన భాద్యత ప్రభుత్వానిదే.. NDA సారధ్యం లో టెక్నాలజీని వాడి, సంస్కరణలను తీసుకొచ్చి ఈ రంగాన్ని సంరక్షించడం ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చిన చంద్రబాబుకి మాత్రమే సాధ్యం.
వ్యాసకర్త
యార్లగడ్డ వెంకట్రావ్, ప్రభుత్వ విప్ మరియు గన్నవరం శాసన సభ్యులు.