ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలనేవి ఉండవని.. తాము ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఘనంగా చెబుతూ ఉంటాయి. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా… ఎన్ని పథకాలు అమలు చేసినా.. రైతన్నలు… తమ సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యే అనుకునే పరిస్థితులు మాత్రం మారడం లేదు. గత ఏడాది కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. వారిని ఏ పథకమూ ఆదుకోలేదు. ప్రాణాలు తీసుకుంటున్న వారిలో వ్యవసాయ కూలీలు కూడా ఉన్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో విడుదల చేసిన లెక్కలు… రైతుల దీన స్థితిని తెలియచేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో… రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 55 శాతం పెరిగాయి. 2018లో 664 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. 2019లో ఆ సంఖ్య 1029కి చేరింది. దేశంలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్రలో జరుగుతున్నాయి. తర్వాత స్థానం కర్ణాటకది. మూడో స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. గత ఏడాది నాలుగో స్థానంలో ఉండేది. రైతుల కష్టాలు మరింత పెరిగి.. మూడో స్థానానికి వెళ్లింది. వాస్తవానికి ఈ మరణాలు… భూమి ఉన్న రైతుల ఆత్మహత్యలవే. కౌలు తీసుకుని సాగు చేస్తున్న రైతుల ఆత్మహత్యలు లెక్కిస్తే… కర్ణాటక కన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఏపీకి రెండో స్థానం వస్తోంది. గతేడాది ఆత్మహత్య చేసుకున్న రైతులు, వ్యవసాయ కూలీల్లో 10 శాతం ఆంధ్రకు చెందినవారే. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. సొంత భూమి ఉండి సాగు చేసుకుంటూ ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఏకంగా 120 శాతం పెరిగింది.
తెలంగాణ రైతుల ఆత్మహత్యల్లో ఐదో స్థానంలో ఉంది. దేశం మొత్తం మీద.. ర ైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అంతకంతకూ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. 2019లో దేశం మొత్తం మీద 42480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కిసాన్ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది. తాము రైతులకు ఎంతో చేస్తున్నామని చెబుతోంది. ఫసల్ బీమా అని.. మరొకటి అని వేల కోట్లు కర్చుతో పథకాలు అమలు చేస్తున్నామని చెబుతోంది కానీ. రైతుల జీవితాలు మాత్రం బాగుపడటం లేదని తేలుతోంది. రైతులకు కావాల్సింది పథకాలు కాదని.. గిట్టుబాటు ధర అనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. కానీ.. ప్రభుత్వాలు.. ఎంతో కొంత నగదు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి కానీ.. మౌలికమైన సమస్యను తీర్చడానికి మాత్రం..ముందుకు రావడం లేదు. దాంతో సమస్య అంతకంతకూ తీవ్రమవుతోంది.