మౌలిక సదుపాయాలు ఎంత బాగుంటే అభివృద్ధి కూడా అంతే బాగుంటుంది. మౌలిక సదుపాయాలంటే ప్రభుత్వాలకు ప్రధానంగా రోడ్లే. రోడ్లు ఎంత బాగుంటే రాష్ట్రం అంత బాగుంటుంది. కానీ ఏపీ పరిస్థితి చూస్తే మనసు చివుక్కుమనక మానదు. ఓ వైపు జాతీయ రహదారులుపై శరవేగంగా వెళ్లిపోతూంటారు. కానీ రాష్ట్ర రహదారులకొచ్చేసరికి అడుగుకో గుంతతో నడుములు విరగ్గొట్టుకోవాల్సి వస్తోంది.
పండగకు ఊరెళ్లిన వాళ్లందరికీ అనుభవమైంది !
గ్రామాలు మొదలు పట్టణాలు వరకూ..సర్వీసు రోడ్లు మొదలుకొని రాష్ట్ర రహదారుల వరకు రాష్ట్రంలో ఏ దారిలో వెళ్లినా ఊగిపోవాల్సిందే. ఒక సారి వర్షాకాలం తర్వాతే రోడ్లను మరమ్మతు చేయాలి. అలా చేస్తేనే రోడ్ల నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. కానీ గత మూడేళ్లుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. గుంతలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి…కానీ మరమ్మతులు చేస్తున్న పాపాన పోవడం లేదు. ఏపీలో ఉన్న వారికి అలవాటైపోయిందేమో కానీ… ఇతర ప్రాంతాల్లో ఉండి… వెళ్లిన వారు మాత్రం.. ఇవేం రోడ్లు బాబోయ్ అని కిందా మీదా పడటం మాత్రం కామన్ అయిపోయింది.
రోడ్ల పేరుతో వసూలు చేస్తున్న టాక్సులేమవుతున్నాయి ?
రోడ్లు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలు కాదు. అదనంగా రోడ్ల కోసం ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి ముక్కుపిండి మరీ టోల్ వసూలు చేస్తున్నారు. ఏపీలో పెట్రోల్, డీజిల్పై ప్రతీ లీటర్కు రూపాయి చొప్పున గత మూడున్నరేళ్లుగా వసూలు చేస్తున్నారు. కానీ ఖర్చు పెడుతున్నదే లేదు. రోడ్లను అలా వదిలేశారు. చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు కూడా నాశనం అయిపోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రూట్లలో కూడా రోడ్లు బాగా లేవని ఆర్టీసీ సర్వీసులు రద్దు చేస్తున్నారు.
ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన కాంట్రాక్టర్లు
కాంట్రా క్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించక పోవడంతో ప్రభుత్వం టెండర్లకు పిలిచినా అధునీకరణ పనులకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో గుంతలను మట్టితోనే..కంకరతోనే పూడ్చే పని మాత్రం అక్కడక్కడా తాత్కలికంగా చేస్తున్నారు. చాలా వాటికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గతంలో ఎన్డీబీ నిధులు నేరుగా బ్యాంకుల నుంచి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తీా చూస్తే.. ఆ నిధులనూ ప్రభుత్వం వాడేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న రోడ్లలో ఏడాదికి కనీసం 8 వేల కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతుల పనులు చేయాల్సివుంది. కానీ చేయడం లేదు.