ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు ఏ కార్యక్రమాన్నీ చేపట్టలేకపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ ధర్మపరిరక్షణ యాత్ర అని పెట్టుకుని తిరుపతి ఉపఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలనుకుంటే… ముందుగా అనుమతి ఇచ్చి ప్రారంభానికి ముందే నిబంధనలు ఉల్లంఘించారని నిలిపివేశారు. నేతల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. అదే సమయంలో.. బీజేపీ నేతల్ని విజయవాడలో హౌస్ అరెస్ట్ చేశారు. కొంత మంది నేతల్ని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్లో రోజంతా కూర్చోబెట్టారు. వారు.. డీజీపీ ఆఫీసును ముట్టడిస్తారేమోనని పోలీసులు అలా చేశారు. దీనిపై సోము వీర్రాజుకు కూడా కోపం వచ్చింది. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా.. ఎమర్జెన్సీ ఉందా.. అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీలను తమ రాజకీయ కార్యకలాపాలను.. ప్రజల్లోకి వెళ్లే ప్రణాళికలను కూడా అమలు చేయకుండా.. ఏపీ ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్షాలపై కట్టడి ఉంటోంది. గతంలో అసెంబ్లీ ముట్టడి అయితేనో..సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి అయితేనో… ముందస్తు అరెస్టులు చేసేవారు. ఇప్పుడు..ఏ ముట్టడి లేకపోయినా… రాజకీయ ప్రచారం కోసం యాత్రలు పెట్టుకున్నా… ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. దాని కోసం పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ఉపయోగిస్తున్నారు. చివరికి రాజకీయనేతలు సవాళ్లు చేసుకుంటే… ప్రతిపక్ష నేతల్ని కూడా అరెస్ట్ చేసి రోజంతా పోలీస్ స్టేషన్లలో ఉంచి.. వందల మంది పోలీసుల్ని వారింటి చుట్టూ మోహరించాల్సిన పరిస్థితి.
భారతీయ జనతా పార్టీ నేతలు రథయాత్ర చేసుకుంటామని చెప్పారు. దానికి అనుమతులు ఇవ్వరేమో అనే అనుమానంతో అదే పనిగా వారు ప్రకటలు చేస్తూంటే.. పోలీసులు కూడా.. నిబంధనలకు అనుగుణంగా అనుమతి ఇస్తామని చెప్పాలి కానీ న్యాయసలహా తీసుకుంటున్నామని.. మరొకటని .. వారిని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రథయాత్రను చేయనివ్వరని ఇప్పటికే ఫిక్సైపోయిన బీజేపీ నేతలు ప్లాన్ బీ వెదుక్కుంటున్నారు. మొత్తానికి ప్రతిపక్ష నేతలకు కాపలా పెట్టడానికే ప్రభుత్వానికి సమయం సరిపోవడం లేదన్న విమర్శలు మాత్రం జోరుగా వినిపించడానికిఈ పరిస్థితి కారణం అవుతుంది.