ఏపీ సెక్రటేరియట్లో తొమ్మిది అధికారులు… ఓ కోటరీగా ఏర్పడి జగన్ కోసం పని ప్రారంభించేశారు. జగన్ వస్తే… సీఎం పేషిలో ఎవరుండాలనే దగ్గర్నుంచి… తొలి సంతకం దేనిపైన పెట్టాలనే దానిపై కూడా చర్చలు జరిపి ఫైళ్లు సిద్ధం చేసుకుంటున్నారట. మరికొంత మంది విధేయతా ప్రదర్శనలో ముందడుగు వేసేందుకు ఫైళ్లు కాపీ చేసి.. సెక్రటేరియట్‌కు పంపుతున్నారట. ఇప్పుడిదే అసలు గగ్గోలు..!
వైసీపీలో మంత్రివర్గం హడావుడి – సెక్రటేరియట్లో పేషీల సందడి..!
వైసీపీ గెలుస్తుంది… నాకు మంత్రి పదవి వస్తుందని.. వైసీపీ తరపున పోటీ చేసిన 150 మంది అభ్యర్థులు .. కలలు కంటున్నారు. పోటీ చేయని మరో ఇరవై మందికి కూడా జగన్ మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు. వారంతా కలల్లో ఉన్నారు. తమకు ఏ శాఖ వస్తుందా.. అని అంచనాలు వేసుకుంటున్నారు. కొంత మంది ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు. కాబోయే మంత్రివర్యులుగారినని.. చెప్పుకుంటున్నారు. ఈ లోపే.. సెక్రటేరియట్లో అలాంటి కూటమి తయారయింది. ప్రస్తుత ప్రభుత్వంలో తాము అనుకున్న శాఖలు లభించక.. కీలక పోస్టింగులు దొరకలేదని బాధపడే ఉన్నతాధికారులు … జగన్ అధికారంలోకి వస్తే.. కీలక శాఖలు, అధికారాలు దక్కుతాయని ఆశ పడుతున్నవారు… జై జగన్ అంటున్నారు. జగన్ కు సన్నిహితంగా ఉండే నేతల వద్దకెళ్లిపోతున్నారు.
జగన్ మొదటి సంతకాల కోసం ఫైళ్లు కూడా రెడీనట..!
ఫలితాలు రాక ముందే విధేయత చూపుతున్న ఈ అధికారుల తీరును.. వైసీపీ నేతలు కూడా.. ముందుగానే ఉపయోగించుకోవడం ప్రారంభించారు. వైసీపీలో ఉన్న కొంతమంది అగ్రనేతల సూచనల మేరకు సచివాలయంలో కీలక శాఖల ఫైళ్లలోని సమాచారన్ని వారికి పంపిస్తున్నారు. మరికొంత మంది పెన్ డ్రైవ్ లో పెట్టుకొని మరీ తమ వద్దనే ఉంచుకుంటున్నారు. మరికొంతమంది జగన్ అధికారంలోకి వస్తే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం చేయాల్సిన ఫైళ్లను కూడా సిద్ధం చేస్తున్నారు. వైసీపీ ప్రకటించిన నవరత్నాలలో ఇచ్చిన హామీల మేరకు తొలి సంతకం ఏ ఫైల్ పై చేయాలి, దానికయ్యే ఖర్చు, తదితర వివరాలతో ఫైళ్లను రూపొందించేందుకు సమాచారాన్ని సేకరిస్తున్నారు. నలుగురు అధికారులు ఈ పని మీదనే ఉన్నారు.
పార్టీలు రాజకీయ నాయకులు కూడా తక్కువే..!
జగన్ వస్తే ఆయన పేషీలో ఎవరుండాలనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు పేర్లు వినవిస్తున్నాయి. మొత్తం తొమ్మిది మంది అధికారులు సచివాలయంలోను, వారాంతంలోనూ తరచూ సమావేశమై ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరెవరికి ఎక్కడ పోస్టింగ్స్ ఇవ్వాలనే అంశంపై చర్చలు జరుపుతున్నారు. పార్టీలు మారే రాజకీయ నేతలు సైతం వీరి ముందు దిగదుడుపే నన్న చర్చ నడుస్తోంది. వీరి సంగతి తెలిసి.. మంత్రులు, కీలక నేతలు నవ్వుకుంటున్నారు. నిజంగా.. జగన్ అధికారంలోకి వస్తారని నమ్మితే.. ఫైల్స్ కాపీ చేసుకోవాల్సిన అవసరం ఏముందని అంటున్నారు.