జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులు సర్దుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ నేతలు నిలువరిస్తున్నారు. ఏ ఒక్కరిని సేఫ్ గా పంపే ప్రయత్నం చేసినా పరిణమాలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికలు రావడంతో ఎవర్నీ బయటకు వెళ్లనీయడం లేదు. ముఖ్యంగా డిప్యూటేషన్ పై వచ్చి.. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన వారికి కనీసం సెలవులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. దీంతో డెప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమను రిలీవ్ చేయాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్న డెప్యుటేషన్ పై వచ్చిన పలువురు అధికారులకు ఇదే చెబుతున్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మార్గదర్శిపై తప్పుడు కేసుల్లో ప్రధాన వ్యక్తి. ఆయన తాను పోతానంటూ లెటర్ పెట్టుకున్నారు. గనుల శాఖ ఎండీ వీజీ వెంకటరెడ్డి కూడా అదే చేశారు. ఇక సాక్షితో పాటు వైసీపీ ప్రచారానికి ప్రజాధనం దోచి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, మద్యం స్కామ్ ను తన చేతులపై నడిపించిన ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అంతా తాము తమ శాఖలకు వెళ్లిపోతామని లెటర్లు పెట్టుకున్నారు.
ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. తెలంగాణాకు వెళ్లేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. తెలంగాణాకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులూ దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం ఎవర్నీ కదలనీయకుండా చేస్తోంది. సెలవుపై వెళ్తానంటూ దరఖాస్తు చేసుకున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి సెలవునుకూడా తిరస్కరించారు. సెటిల్ చేయాల్సిన లెక్కలు చాలా ఉన్నాయని టీడీపీ నేతలంటున్నారు.