ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల హడావుడి మళ్ళీ మొదలయింది. మొన్న ఎసిబి అధికారులు ఓటుకి నోటు కేసులో దాఖలు చేసిన చార్జ్ షీటులో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించారు. ఆయనను ఈ కేసులో దోషి అని చెప్పకపోయినప్పటికీ చార్జ్ షీటులో ఆయన పేరు చేర్చడం వెనుక ఉద్దేశ్యం మాత్రం అదేనని అర్ధమవుతోంది. చంద్రబాబు నాయుడు ప్రతిష్టని దెబ్బతీసేందుకే ఉద్దేశ్యపూర్వకంగా ఆయన పేరుని చార్జ్ షీటులో చేర్చారని ఏపి మంత్రులు, తెదేపా నేతలు తప్పుపట్టారు. తీవ్రంగా ఖండించారు. బహుశః అందుకు బదులుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే ధీటుగా స్పందించింది.
తెలంగాణా ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిర్యాదు ఆధారంగా ఈరోజు తెలంగాణా హోం కార్యదర్శి రాజీవ్ త్రివేదికి ఆంద్రప్రదేశ్ సిట్ అధికారులు నోటీసు ఇచ్చేందుకు కొద్ది సేపటి క్రితం తెలంగాణా సచివాలయానికి జేరుకొన్నారు. మరి ఆయన ఆ నోటీసును తీసుకొంటారో లేదో, తీసుకొంటే తెలంగాణా ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు స్టే ఉన్నందున ఆంద్రప్రదేశ్ మరో విదంగా దీనిని ముందుకు నడిపించినట్లుంది. కానీ ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ వ్యవస్థలను రెండు ప్రభుత్వాలు తమ రాజకీయ పగలు, ప్రతీకారాల కోసం ఈవిధంగా వినియోగించుకోవడం చాలా దురదృష్టకరం. ఎసిబి, సిట్ అధికారులు నిజంగా ఈ రెండు కేసుల్లో దోషులను పట్టుకొని శిక్షపడేలా చేయగలిగితే ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఈ రాజకీయ క్రీడలో ప్రభుత్వాలే వాటిని పావులుగా వాడుకోవడం, అవి వాటికి నిస్సహాయంగా సహకరించాల్సి రావడం చాల శోచనీయం.