ఆంధ్రప్రదేశ్‌లో దుర్భర దారిద్ర్యం కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రభుత్వానికి పనులు చేసిన వాళ్లకి బిల్లులు రావడం లేదు. ఉద్యోగం చేసిన వారికి జీతం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. జీతం ఇవ్వండి మహా ప్రభో అని టీచర్లు కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. ఇక తమ జీతాల్లోంచి కట్ చేసుకున్న పొదుపు సొమ్ములు ఇవ్వాలని వెంట పడుతున్నా.. ప్రభుత్వం… సంక్రాంతికి కొంచెం ఇస్తాం పండగ చేసుకోండి అని సలహా ఇస్తున్నారు. అదే సమయంలో మరో వైపు దుబారా మాత్రం ఓ రేంజ్లో సాగుతోంది.
బీసీ సభ ఖర్చంతా ప్రజల సొమ్మే !
విజయవాడలో వైసీపీ నేతలు నిర్వహించిన బీసీ సభ పార్టీ పరంగా చేశారా.. ప్రభుత్వ పరంగా చేశారా అన్నది సీక్రెట్‌గా ఉంచారు. అయితే పార్టీ పరంగా జరగలేదని ప్రభుత్వ పరంగానే జరిగిందన్నదానికి కొన్ని ఉదాహరణలు వెలుగు చూస్తున్నాయి. అన్ని జిల్లాల నుంచి విజయవాడకు తరలించిన పదిహేను వందలకుపైగా ఆర్టీసీ బస్సులను వైసీపీ నేతలు బుక్ చేయలేదు. దీంతో ప్రభుత్వ కార్యక్రమంగానే రాసుకుని వాటిలో జనాలను తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే మొత్తం ఖర్చు ప్రభుత్వానిదే. ఎంత లేదన్నా కనీసం పాతిక కోట్ల వరకూ ఖర్చు అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదంతా ప్రజల సొమ్మే.
రెడ్డి సలహాదార్ల విప్లవం.. అందరికీ లక్షల్లో జీతాలు !
ఇటీవలి కాలంలో సలహాదారులను ఇష్టారీతిన నియమిస్తున్నారు. ఎంతగా అంటే… ప్రతీ రోజూ సలహాదారుల నియామకం గురించి చెప్పాల్సిన అవసరం ఉందా అని మీడియా కూడా భావించేంతగా. తాజాగా వ్యవసాయ శాఖకు మరో ఇద్దరు సలహాదారులను నియమించారు. ఇద్దరూ కడప జిల్లాకు చెందిన రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే. ఇలాంటి వారు వంద దాటిపోయి ఉంటారు. వీరందరూ ఒక్కొక్కరికి.. కనీసం మూడు లక్షల వరకూ ఉంటుంది. ఇక వారి మెయిన్టనెన్స్ ఇతర ఖర్చుల గురించి చెప్పాల్సిన పని లేదు.
విందులు వినోదాలకు కొదవేం ఉండదు !
ఇటీవల బీసీ కుల సంఘాల నేతలకు విందులివ్వడానికి కార్పొరేషన్లకు రెండు లక్షలు విడుదల చేశారు. నిజానికి కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి ఆయా కులాల యువత స్వయం ఉపాధికి సహకరించాల్సి ఉంటుంది. అలా చేయకుండా విందు భోజనం పెట్టి ఓట్లు కొట్టేసేందుకు ప్రజాధనాన్ని వినియోగించుకుంటున్నారు. ఇటీవలే సీఎం ఇంటికి రెండు కోట్లకు కొత్త సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సీఎం అడుగు బయటపెడితే ప్రత్యేక విమానాలు.. తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్లాలన్నా హెలికాఫ్టర్ వాడుతున్నారు.
ఆర్థికంగా దుర్భర పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం ఖర్చులు తగ్గించుకుంటుంది. కానీ ఏపీ మాత్రం దుబారా చేస్తోంది. అందుకే ప్రజలు కూడా ఇదేం ఖర్మ అనుకోక తప్పడం లేదు.