ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారులుగా సుచిత్ర ఎల్లా , సతీష్ రెడ్డి, కేపీసీ గాంధీ , ఫణిక్కర్ సోమనాథ్లను నియమించింది. వీరి స్థాయికి తగ్గట్లుగా వీరికి కేబినెట్ హోదాను కల్పించింది. ఈ నలుగురూ వారివారి రంగాల్లో దిగ్గజాలే. ఏపీ అభివృద్ధికి అనేక అంశాల్లో సాయం చేసేవాళ్లే.
నేడు రాష్ట్రం కోసం పని చేసే సలహాదారులు
సుచిత్రా ఎల్లా .. భారత్ బయోటెక్ ఎండీగా ఉన్నారు. కోవాగ్జిన్ ను ప్రపంచానికి అందించడంలో కీలకపాత్ర పోషించారు. ఫార్మా రంగంలో అనుభవం ఏపీకి ఉపయోగపడుతుంది. ఆమె ఫార్మారంగంలో పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. ఇక రక్షణ రంగ నిపుణుడు సతీష్ రెడ్డి ఏపీకి ఎప్పుడూ పెట్టుబడులు తెచ్చేందుకు .. రక్షణ రంగంలో ముందడుగు వేసేందుకు సహాయపడతారు. ట్రూత్ ల్యాబ్స్ నిపుణులు గాంధీ, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ల సేవలు తీసుకోవడావనికి ఆలోచించాల్సిన అవసరం లేదు. వీరెవరికీ కేబినెట్ హోదా కోసం పదవులు ఇవ్వాల్సిన అవసరం కానీ..తీసుకోవాల్సిన అవసరం కానీ లేదు.
నాడు అక్రమ పనుల కోసం సలహాదారులు
వైసీపీ హయాంలో సలహాదారులు ఎవరు అంటే ప్రభుత్వ పెద్దల అక్రమాలు, దోపిడీని క్రమబద్ధం చేసుకోవడానికి సహకరించేవారు. ఐటీ సలహాదారుగా జగన్ నియమించిన రాజ్ కసిరెడ్డి వాలంటీర్లు ఇంటింటికి సేకరించిన సమాచారాన్ని తన సంస్థలో పెట్టుకునేవారు. ఆయన మద్యం స్కాంలో కింగ్ పిన్ అని విజయసాయిరెడ్డి కూడా ఆరోపించారు. ఇక డేటా చోరీ పేరుతో ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తికి.. కడపలో దొంగ డీజిల్ అమ్ముకుంటాడన్న ఆరోపణలు ఉన్న వ్యక్తికి.. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ సలహాదారులలో ఒక్కరికీ కెపాసిటీ ఉండదు. అయితే రాజకీయ అవసరాల కోసం లేకపోతే తమ తప్పుడు పనుల కోసం సలహాదారుల పదవులు ఇచ్చి.. వందల కోట్లు వారికి చెల్లించారు.
వారి సేవలను వినియోగించుకునే ప్రణాళిక ఉండాలి !
వైసీపీ హాయంలో సలహాదారుల్ని చక్కగా ఉపయోగించుకున్నారు. వారిని ఎందుకు నియమించుకున్నారో దానికి తగ్గ పనులు చేయించుకున్నారు. టీడీపీ నియమించుకున్నవారు ఆయా రంగాల్లో నిష్ణాతులు. వారు చాలా బిజీగా ఉంటారు. అయినా సలహాదారులుగా ఉండేందుకు అంగీకరించారు కాబట్టి వారి సమయాన్ని వీలైనంతగా ఉపయోగించుకుని రాష్ట్రం కోసం అవసరమైన ఆలోచనలు రాబట్టుకోవాలి. తమ ఆలోచనలకు విలువ లభిస్తుందని ..తాము కేటాయించే సమయానికి తగ్గ ప్రతిఫలం రాష్ట్రానికి దక్కుతుందని.. సరైన గౌరవం లభిస్తుందని అనుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది.