ప్రత్యేకహోదా కోసం అడుగుతూన ఉంటాను.. ఇచ్చినప్పుడు తీసుకుంటాను అంటున్న ఏపీ సీఎం జగన్ను కేంద్రం ఎప్పుడూ లైట్ తీసుకుంటూనే ఉంది. కనీసం ఆయన విజ్ఞప్తులకు విలువ కూడా ఇవ్వడం లేదు. ఏపీ సీఎం జగన్ ఎప్పుడు కలిసినా ప్రధాని మోదీని ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతూనే ఉన్నారు. ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు కూడా ఇచ్చిన వినతి పత్రంలో చిట్ట చివరి అంశంగా ప్రత్యేకహోదా ఉంది.
అయితే కేంద్రం మాత్రం సీఎం జగన్ వినతుల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎప్పుడు పార్లమెంట్లో సమాధానం చెప్పాల్సి వచ్చినా ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అని చెబుతూనే ఉంది. మరోసారి అదే ప్రకటన చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎందుకు ఇవ్వడం లేదంటే పాత కారణాల్నే చెప్పారు.
ప్రత్యేకహోదా అంశంపై కేంద్రం మొదటి నుంచి ఇదే సమాధానం చెబుతోంది. అయితే ఏపీలో రాజకీయ పరిస్థితులు మాత్రం ప్రత్యేకహోదా అంశాన్ని సజీవంగానే ఉంచుతున్నాయి. అధికారంలోకి వస్తే కేంద్రంలో ఎవరు ఉన్నా మెడలు వంచి ప్రత్యేకహోదా తీసుకు వస్తామని సీఎం జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే కేంద్రానికి తమ అవసరం లేనందున డిమాండ్ చేయలేమని.. కానీ ఇచ్చే వరకూ అడుగుతూనే ఉంటామన్నారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతు ఎన్డీఏకు అవసరమైన సందర్భంలో పలువురు ప్రత్యేకహోదాను షరతుగా పెట్టాలని సూచించారు. కానీ పట్టించుకోలేదు. కనీసం ప్రత్యేకహోదాను ఇవ్వకపోయినా పరిశీలిస్తామని అయినా ఓ మాట చెప్పి ఉంటే.. జగన్కు కనీస గౌరవం ఇచ్చినట్లుగా ఉండేదని వైసీపీ ఎంపీలు గొణుక్కుంటున్నారు.