ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అచ్చంగా శ్రీలంకనే తలపిస్తున్నాయి. అత్యధిక జీవన వ్యయం.. అతి తక్కువ తలసరి ఆదాయం టెక్నికల్‌గా కనిపిస్తూండగా ప్రత్యక్షంగా పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. అంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కరెంట్ కోతలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా పల్లె ప్రాంతాలను టార్గెట్ చేశారు. రాత్రి, పగులు తేడా లేకుండా గంటల తరబడి కరెంట్ తీసుకున్నారు. అసలే ఎండా కాలం కావడంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. కానీ ఎక్కడా అధికారిక కరెంట్ కోతలు ప్రకటించలేదు. శ్రీలంకలో మాత్రం అధికారికంగా పది గంటల కరెంట్ కోతలు ప్రకటించారు. ప్రస్తుతం శ్రీలంక పరిస్థితులు అత్యంత ఘోరంగా ఉన్నాయి. నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.
ఏ వస్తువులూ అందుబాటులో ఉండటం లేదు. ప్రజలకు పెద్ద ఎత్తున డబ్బులు ముద్రించి పంచడంతో డబ్బులున్నాయి కానీ తినడానికి తిండి లేదు. ఫలితంగా రేట్లు పెరిగిపోయాయి. ఏపీలో వివిధ రకాల పన్నులు బాదేసి ప్రజలకు నగదు బదిలీ పథకాలు అమలు చేస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వం పూర్తిగా అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. లెక్క లేనన్ని అప్పులు చేసింది. తీర్చే మార్గం చూసుకోలేదు. ముందూ వెనుకా చూసుకోకుండా చైనా వంటి దేశాల వద్ద అప్పులు చేసి నిండా మునిగిపోయింది. విదేశీ మారకద్రవ్యం కరిగిపోయింది. ఇప్పుడా దేశానికి అప్పులిచ్చేవారు కూడా లేరు. ఇండియానే దయతలిచి కొంత వస్తు సాయం చేస్తోంది. ఏపీలో కూడా అప్పుల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. రాజ్యాంగాన్ని అతిక్రమించితప్పుడు చట్టాలు చేసి మరీ అప్పులు తెచ్చి వాడేశారు. అప్పులు ఇవ్వవొద్దని బ్యాంకులను కేంద్రం ఆదేశించే పరిస్థితి.
అప్పులు పుట్టడం లేదు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదు. చివరికి అప్పుల విషయంలోనూ పూర్తి వివరాలు ప్రజలకు తెలియనివ్వడం లేదు. అంతిమంగా శ్రీలంక ప్రజలు ఇప్పటికే సంక్షోభస్థాయికి చేరుకున్నారు.. కానీ ఏపీ ప్రజలు మాత్రం ప్రారంభస్థాయిలోనే ఉన్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. త్వరలో దారుణమైన. దుర్భరమైన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. శ్రీలంకను చూసి అయినా తీరుమార్చుకోవాలన్న సలహాలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. కానీ మన పాలకులకు అవేమీ పట్టే పరిస్థితి లేదు.