ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మొదటి విడత రుణామాఫీ చేసింది. దీని కోసం రూ. ఆరు వేల కోట్ల పైచిలుకు మొత్తం పంపిణీ చేసింది. ఈ మొత్తం అప్పులే. మొదట ఆర్బీఐ బాండ్లను వేలం వేశారు. తర్వాత వేస్ అండ్ మీన్స్ కింద కొంత మంది తెచ్చుకున్నది వాడుకున్నారు. చివరికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కోసం ఉన్న రూ. 430 కోట్లనూ మళ్లించుకున్నారు. వివిధ కార్పొరేషన్ ఖాతాలో ఉన్న చిల్లర కూడా వదిలి పెట్టలేదు. అయినా సరిపోకపోవడంతో.. ఆర్బీఐ వద్దకు ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లారు. అలా రూ. రెండు వేల కోట్లు తీసుకు వచ్చారు. దాంతో.. పథకాన్ని అమలు చేసేశారు. డబ్బులు పంపిణీ చేసేశారు. కానీ ఇప్పుడు వాట్ నెక్ట్స్ అనే ప్రశ్న అధికారుల్లో వస్తోంది.
ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం అంటే.. పూర్తిగా చేతులెత్తేయడమే. ఓడీ తీసుకున్న రాష్ట్రం.. మళ్లీ ఆ సొమ్ము చెల్లించే వరకూ ఎక్కడా అప్పు తీసుకోవడానికి లేదు. ఆర్బీఐ నిబంధనలు అంగీకరించవు. అదే సమయంలో.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం ఓడీ ఖాతాకు వెళ్లిపోతుంది. 21 రోజుల్లో ఓవర్ డ్రాఫ్ట్‌గా తీసుకున్న మొత్తంతో పాటు అసలు చెల్లించాలి. లేకపోతే.. దివాలా తీసినట్లుగా ఆర్బీఐ ప్రకటిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో.. ఈ మొత్తాన్ని ఆర్బీఐకి సర్దుబాటు చేస్తున్నారు. నెలకు ఏపీ సర్కార్‌కు రూ. రెండు వేల కోట్ల ఆదాయం రావడం లేదు. ఎక్కువగా అప్పుల మీదే నడుస్తోంది. ఇప్పుడు అప్పులు కూడా.. పుట్టని పరిస్థితి.
అయితే.. ఆర్బీఐ నుంచి కాకపోతే.. బయట ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మరో రూ. పదకొండు వేల కోట్లు.. ఏపీ తెచ్చుకోవచ్చు. కానీ ఇచ్చే వారెవరు..? ఆర్థిక క్రమశిక్షణ లేని రాష్ట్రానికి .. విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి.. ఎలాంటి సంపద సృష్టించని వారికి అప్పు ఇవ్వాలని ఎవరు మాత్రం అనుకుంటారు..? ప్రస్తుతం ఏపీది అదే పరిస్థితి. ఆర్థిక శాఖ అధికారులు మాత్రం చాలా సీరియస్‌గా తమ ప్రయత్నం తాము చేస్తున్నారు. ఒక వేళ… ఇప్పుడు ఓడీ మొత్తాన్ని కట్టేసినా.. మళ్లీ జీతాల కోసం.. ఆ వెసులుబాటు వాడుకోకతప్పదు. లేకపోతే.. ఉద్యోగులకు జీతాలు అందవు.