ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు జీతాలు, రిటైరైన వారికి పెన్షన్లు ఇంకా అందలేదు. ద్రవ్యవినిమయ బిల్లును టీడీపీ అడ్డుకోవడంతోనే జీతాలు ఆలస్యమయ్యాయని ఒకటో తేదీన సలహాదారు, మంత్రి మీడియా ముందుకు వచ్చి దుమ్మెత్తిపోశారు. అయితే.. అదే రోజు ద్రవ్య వినిమయ బిల్లుపై గవర్నర్ సంతకం చేశారు. అంటే… బిల్లు పాసైపోయినట్లే. నిధులు వాడుకోవడానికి అవకాశం వచ్చినట్లే. కానీ.. ఆరు రోజులు గడిచినా ఇంత వరకూ.. ఉద్యోగుల ఖాతాలో జీతాలు జమ చేయలేదు. ఒక్క డిపార్ట్మెంట్ వారికీ.. జీతాలు విడుదల కాలేదు. దీనిపై ఉద్యోగుల్లో.. పెన్షనర్లలో ఆందోళన నెలకొంది.
సాధారణంగా.. జీతాల కోసం నిధులు డ్రా చేసే ప్రక్రియ ప్రతి నెల ఇరవయ్యో తేదీ నుంచి జరుగుతుంది., సీఎంఎఫ్ఎస్ అనే విధానంలో.. చాలా తక్కువ ప్రాసెస్‌తో పని పూర్తయిపోతుంది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోయినా.. ఈ ప్రాసెస్ రెడీ చేసి పెట్టి… గవర్నర్ సంతకం కాగానే.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. ఆ తర్వతా అన్ని పథకాలకు ముఖ్యమంత్రి.. ల్యాప్‌ట్యాప్‌లో మీటను నొక్కినట్లుగా నొక్కేస్తే జీతాలు ఉద్యోగుల అకౌంట్లలో పడిపోయేవి. కానీ అలా నొక్కడానికి ఇప్పటికి ఆరు రోజులు సమయం పట్టింది. ఇంకా.. నొక్కలేకపోయారు.
ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయా.. అని ఇతర శాఖల అధికారులు.. ఆర్థిక శాఖ వద్ద వాకబు చేస్తున్నారు. అయితే.. అలాంటివేమీ లేవని.. సాంకేతిక కారణాల వల్ల మాత్రమే ఆలస్యం అవుతున్నాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అంత సాంకేతిక ఇబ్బందులేమిటో మాత్రం చెప్పడం లేదు. సోమవారానికైనా వస్తాయనుకున్నారు కానీ రాకపోవడంతో… నిరాశకు గురయ్యారు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పధ్నాలుగు నెలలు అయితే.. ఈ పధ్నాలుగు నెలల్లో సమయానికి జీతం ఇచ్చింది.. మూడు, నాలుగు నెలలు మాత్రమే. అదీ కూడా.. కొన్ని డిపార్ట్మెంట్ల వారికి.. విడతల వారీగా ఇస్తూండటంతో.. ఉద్యోగుల్లోనూ అసహనం పెరుగుతోంది. ఎలాంటి పరిస్థితి ఉన్నా జీతాలు ఇవ్వలేని ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోదు. ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై ఉద్యోగులలో ఆందోళన ప్రారంభమయింది.