మంగళవారం రోజు.. దేశం మొత్తం… ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తరచూ చెబుతూంటారు దేశం మొత్తం .. ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా చేస్తానని. ఆ పద్దతిలో దేశం మొత్తం ఏపీ వైపు చూసింది. ఎందుకంటే… మంగళవారం.. దేశంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది నెంబర్ వన్ మరి. ఇప్పటి వరకూ.. మహారాష్ట్ర ఆ కేటగిరిలో ఉంది. ముంబై, పుణె, నాగపూర్ వంటి.. బడా బడా నగరాలు ఉన్న రాష్ట్రం.. ధారావి లాంటి మురికివాడలు ఉన్న రాష్ట్రం కావడంతో.. అక్కడ.. వైరస్ వ్యాప్తి సహజంగానే ఎక్కువ. అందుకే మహారాష్ట్రలో భారీ కేసులు నమోదవుతున్నా ఎవరూ పెద్దగా ఆశ్చర్యపడలేదు. తమిళనాడులోనూ అంతే. అక్కడ నమోదవుతున్న కేసుల్లో అత్యధికం చెన్నైతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లోనే. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ముంబైలో పది శాతం ఉండే నగరం లేదు. చెన్నైతో ఇరవై శాతం ఉండే నగరమూ లేదు. కానీ.. కరోనా పాజిటివ్ కేసులు మాత్రం… ఆ రెండింటిని మించి నమోదవుతున్నాయి.
పల్లె ప్రాంతాలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలు… కరోనాను పూర్తిగా కంట్రోల్ చేశాయి. వైరస్.. పల్లెలకు చేరకుండా.. జాగ్రత్తలు తీసుకున్నాయి. వలస కూలీలు వచ్చినా… బీహార్ లాంటి రాష్ట్రాలు కూడా… కరోనాను కంట్రోల్ చేశాయి. కానీ… ఏపీమాత్రం..పూర్తి స్థాయిలో విఫలం అయింది. పచ్చని పల్లెలలో కళకళలాడే ఉభయగోదావరి జిల్లాల్లో వైరస్ ఇప్పుడు… బీభత్సం సృష్టిస్తోంది. ఓ మాదిరి నగరాలు లేని జిల్లాల్లో విలయం సృష్టిస్తోంది. రోజూ యాభై అరవై మంది మరణాలు.. ఎడెనిమిది వేల కేసులు.. కామన్‌గా మారిపోయాయి. మరీ ఇంత దారుణమా అని దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది.
కరోనా రాని వాళ్లు అంటూ ఎవరూ ఉండరని పాలకులే చెబుతూ ఉండటంతో.. అసలు నివారణ చర్యలపై అధికారులు దృష్టి పెట్టకపోవడంతోనే సమస్య వచ్చిందన్న అభిప్రాయం అందరిలోనూ వినిపిస్తోంది. ముఖ్యమంత్రే.. తేలికగా తీసుకోవడంతో అధికారులు.. వారిని చూసిప్రజలూ.. లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా.. మొత్తంగా వైరస్ విషయంలో ఓ నిర్లక్ష్య ధోరణి ఏపీలో పెరిగిపోయిందన్న భావన ఏర్పడుతోంది. ఈ పరిస్థితి… విధ్వంసానికి దారి తీసే ప్రమాదం ఉంది. కరోనా కారణంగా పెద్ద దిక్కును కోల్పోతున్న కుటుంబాలు.. అంతకంతకూ పెరుగుతున్నాయి.
ప్రమాదం ముంచుకొస్తున్నా.. పాలకుల్లో మార్పు కనిపించడం లేదు. ఓ వైపు చెట్ల కింద మరణాలు… ఆస్పత్రి ఆవరణల్లో మృతదేహాలు.. తమను ఆస్పత్రిలో చేర్చుకోవాలనే బాధితుల హాహాకారులు… వినిపిస్తున్నాయి. మరో వైపు … 30 నిమిషాల్లో బెడ్ ఇవ్వకపోతే.. కలెక్టర్ల సంగతి తేలుస్తామంటూ.. సీఎం సమీక్షల్లో హెచ్చరికలు చేసినట్లుగా ప్రచారం జరుగుతూ ఉంటుంది.కానీ.. పరిస్థితుల్లో మాత్రం.. ఇసుమంత కూడా మార్పు రాలేదు. ఇదే పరిస్థితి ఉంటే.. ఏపీ కరోనావైపు… దేశం కాదు.. ప్రపంచం మొత్తం తిరిగి చూసే పరిస్థితి వస్తుంది.