తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అసలు ఆర్థిక వెసులుబాటు దొరకడం లేదు. ఎంతగా మేనేజ్ చేద్దామన్నా.. వచ్చినవన్నీ గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవడం లేదు. కొత్తగా అప్పులు పుట్టడం అసాధ్యంగా మారింది. పాత అప్పులు తీర్చడానికి అనేక మార్గాలు వెతకాల్సి వస్తోంది. చివరికి ఈ బాధను రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పెద్దలు బహిరంగంగానే పంచుకుంటున్నారు.
అప్పుల ఊబిలో తెలంగాణ, ఏపీ
తెలంగాణలో పదేళ్ల పాటు కేసీఆర్ పాలన చేసి ఏడు లక్షల కోట్ల అప్పు నెత్తిన పెట్టిపోయారని తెలంగాణ ప్రభుత్వం అదే పనిగా ఆరోపణలు చేస్తోంది.అంత అప్పు లేదని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. కానీ ఇద్దరూ చెప్పే లెక్కలకు భిన్నమైన తేడా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న అప్పుల కంటే.. చెల్లించిన అప్పులు, వడ్డీలేని ఎక్కువ. అంటే ఆ మేరకు వచ్చిన ఆదాయాన్ని వడ్డీల చెల్లింపులకు వాడాల్సి వస్తోంది. కనీసం తాము కష్టపడి పెంచుతున్న సంపాదన, ఆదాయాన్ని కూడా గత ప్రభుత్వాలు చేసిన అప్పుల నిర్వాకాలకు ఖర్చు పెట్టాల్సి రావడం ప్రభుత్వ పెద్దలను ఇబ్బంది పెడుతోంది.
ఇరవై నాలుగు వేల కోట్లు వడ్డీ – ఏపీకి పెను భారం
కేసీఆర్ పదేళ్ల కాలంలో చేసిన అప్పులకు ఆస్తుల సృష్టి జరిగింది.కాళేశ్వరంతో పాటు హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను భారీగా అభివృద్ధి చేశారు. అయితే ఏపీలో చేసిన అప్పులు పూర్తిగా దుర్వినియోగం అయ్యాయి. ఓటు బ్యాంక్ పథకాలకు పంచడానికి ఉపయోగించడంతో వాటి వల్ల సంపద సృష్టి జరగలేదు. ఆదాయం పెరగలేదు. పైగా మద్యం వంటి వ్యవహారాల్లో పాతికేళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టశారు. కేవలం వడ్డీకే ఇరవై నాలుగు వేల కోట్లు కట్టాల్సి వచ్చిందని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
బాధ్యత లేని పాలనతో భవిష్యత్ అంధకారం
ఐదేళ్లకు ప్రజలు అధికారం ఇస్తే ప్రజలను తాకట్టు పెట్టేసి వచ్చే ముప్పై ఏళ్ల ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చి దుర్వినియోగం చేశారు. ఇప్పుడు అవే ప్రజలకు పెను సమస్యగా మారుతున్నాయి. పాలకులకు ఏ పని చేయాలన్నా ఆర్థిక వెసులుబాటు లేకుండా అయిపోయింది. ఇప్పుడు అప్పులు చేస్తున్నా.. ఆ అప్పులు వడ్డీలు.. వాయిదాలు కట్టుకోవడానికి సరిపోతుంది. ఇంకా ఎక్కువ కట్టాల్సి వస్తోంది. ఒకప్పుడు అప్పులతో కనీసం అభివృద్ధి పనులు చేసేవారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది.