దేశ రాజకీయాల్లో ఎంతోమంది తెలుగువారు నీలం సంజీవరెడ్డి , పీవీ నరసింహారావు , ఎన్టీఆర్ , కాకా వెంకటస్వామి , జైపాల్ రెడ్డి , వెంకయ్య నాయుడు లాంటి వారు ఆనాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారని ఈ రోజు ఎవరూ పెద్దగా ప్రముఖ పాత్ర పోషించలేకపోతున్నారని ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లో పాల్గని ప్రసంగించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు కూడా కేంద్రంలో ప్రభుత్వాలను నిర్ణయించారు. కానీ ఎప్పుడైతే తెలుగువారు తమ బలాన్ని తగ్గించుకుంటూ రాష్ట్ర విభజన చేసుకున్నారో అప్పుడే దేశ రాజకీయాల్లో మరోసారి తమదైన ముద్ర వేసే అవకాశాన్ని కోల్పోయారు.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు విడివిడిగా చూస్తే 17, 25 ఉన్నాయి. అందులో ఏ ఒక్క జాతీయ పార్టీ కూడా ఎక్కువ స్థానాలు గెల్చుకోలేదు. అలాగని ఏ ప్రాంతీయ పార్టీ అయినా అత్యధిక స్ధానాలను గెల్చుకుంటుందా అంటే.. అలాంటి పరిస్థితి లేదు. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఎక్కువ స్థానాలను గెల్చుకున్నా అది పదహారు మాత్రమే. ఆ సీట్లు ప్రభుత్వానికి కీలకమే కానీ.. టీడీపీ కాదు అంటే బీజేపీ ప్రత్యామ్నాయం చూసుకోగలదు. ఎప్పటికైనా ఇంత కంటే గొప్ప పరిస్థితి వచ్చే అవకాశం లేదు. ఇక తెలంగాణలో సీట్లు కేంద్రంలో ఎప్పుడూ కీలకం కావడం లేదు.
జాతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద రాష్ట్రాలకు చెందిన నేతలు కీలకంగా ఉండేవారు. జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించేవారు. రాష్ట్రాలు చిన్నవిగా మారిన తర్వాత ఇక్కడ నేతలకు ఢిల్లీలోనూ తమ పార్టీల్లో పలుకుబడి ఉండటం లేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో తెలుగునేతలకు దక్కే ప్రాధాన్యం అంతంతమాత్రమే ఉంటుంది. రేవంత్ రెడ్డి తమ పార్టీ తరపున జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశం వస్తే రావొచ్చు. కానీ ఆయన తెలంగాణలో సాధించే సీట్ల బలంతో పోల్చుకుంటే… పైన ఆయన ఉదహరించిన నేతల స్థాయిలో ఎప్పటికీ ప్రాధాన్యం దక్కదు. అలాంటి అవకాశాలను తెలుగు నేతలు రాష్ట్ర విభజనతోనే కోల్పోయారు.