సినిమా అతి చవకైన వినోద సాధనం అంటూ మన నిర్మాతలు తరచూ చెబుతుంటారు. రెండు గంటల వినోదాన్ని వంద రూపాయలకే ఇచ్చేస్తున్నామన్నది వారి మాట. దానికి తగ్గట్టుగానే రూ.20, రూ.50,రూ. 70ల టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మల్టీప్లెక్స్‌కి వెళ్తే మాత్రం రూ.150 చెల్లించుకోవాల్సిందే. అయితే ఈ రేట్లు భవిష్యత్తులో మారే అవకాశం ఉందా?? అవుననే అనిపిస్తోంది. తాజాగా టికెట్ల రేట్లు క్రమబద్దీకరణపై హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. తెలుగు రాష్ట్రాల హోం కార్యదర్శులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు హై కోర్టు సూచనలు జారీ చేసింది. 2013లో అప్పటి ప్రభుత్వం టికెట్ల రేటు సవరిస్తూ ఓ జీవో జారీ చేసింది. దానిపై ఇప్పటికై హైకోర్టులో చాలా పిటీషన్లు పెండింగులో ఉన్నాయి. దాంతో హై కోర్టు ఈ నిర్ణయం తీసుకొంది. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్.. ఇలా ఏరియాని బట్టి రేట్లు ఉండడం వల్ల.. కొంతమంది బయ్యర్లు నష్టపోతున్నారని, టికెట్ రేట్లలో ఏక రూపత చూపించాలన్నది పిటీషన్ దారులు పేర్కొన్నారు.
దీనిపై సమగ్రమైన విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై 2017 మార్చి నాటికి ప్రతిపాదనలు పంపాలని కోర్టు సూచించింది. దాన్ని బట్టి టికెట్ రేట్లలో మార్పులు రావడం తథ్యమని అనిపిస్తోంది. మల్టీప్లెక్స్ల్ని పక్కన పెట్టి, అన్ని సింగిల్ థియేటర్లలో ఒకే తరహా రేటు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. ఇది ఓ విధంగా నిర్మాతలకు లాభసాటి వ్యవహారమే. రేట్ల సంగతి సరే, థియేటర్లో కనీస సౌకర్యాల మాటేంటి? దాదాపు 80 శాతం థియేటర్లలో మరుగు దొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. ప్రతీ థియేటర్లో మంచి నీటి సౌకర్యం కప్పించాలని కోర్టులు ఆదేశిస్తున్నా.. దాన్ని పట్టించుకొనే నాథుడు లేడు. సౌకర్యవంతమైన సీట్లు కల్పించడంలో ఎందుకు అశ్రద్ద చూపిస్తున్నారు? పేరుకే ఏసీ హాళ్లు.. చాలా థియేటర్లలో అవి పనిచేయవు. ముందు థియేటర్లలో మౌళిక సదుపాయాలు మెరుగు పరచి, ఆ తరవాత రేట్లు గురించి మాట్లాడితే బాగుంటేందేమో..?