ఎన్నికలకు మరో 16 నెలల సమయం ఉందని జగన్ పార్టీ నేతలకు చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… మొదటి ఏడాది నుంచి ఏడాదికో.. రెండేళ్లకో మన ప్రభుత్వం వస్తుందని చెప్పేవారు. అదేంటి .. అలా చెబుతున్నారని అందరూ అనుకునేవారు. అధికారంలోకి వచ్చాక.. తన పదవీ కాలాన్ని రెండు, మూడు నెలలు ఎక్కువగా ఉండేలా చెప్పుకునేవారు. రెండేళ్లు దాటిన తర్వాత ఇంకా మూడున్నరేళ్లుదని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం పదవి కాలాన్ని తగ్గించుకుని చెబుతున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర అంటే.. 18 నెలలుఉంటే.. రెండు నెలలు తగ్గించుకుని చెబుతున్నారు. దీంతో జగన్ కాస్త ముందుగానే ఎన్నికలకు వెళ్తున్నారన్న అంశంపై ఆ పార్టీ నేతలకు క్లారిటీ వస్తోంది.
ఎన్నికల బదిలీలను పూర్తి చేస్తున్న జగన్ !
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఓ క్లారిటీతో ఉంది. అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణతో పాటు జరగాలని కోరుకుంటోంది. రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా వచ్చినా … దానికి తగ్గట్లుగా వ్యూహాలు అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇటీవల అనుకూలమైన పోలీసు అధికారులందర్నీ కీలక స్థానాల్లో నియమించేసింది. త్వరలో పాలన వ్యవస్థలోనూ ఇలాంటి బదిలీలు చేయబోతున్నారు. మామూలుగా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇలాంటి బదిలీలు చేస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడే చేసేస్తోంది.
ఎన్నికలు ఎప్పుడన్నదానిపై కేసీఆర్‌తో సంప్రదింపులు ?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో జగన్‌కు బయటకు కనిపించని అనుబంధం ఉంది. అది ఎన్నో సార్లు బయటపడింది. రెండుపార్టీల మధ్య మంచి అవగాహన ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే బీజేపీతో కేసీఆర్ నేరుగా యుద్ధం ప్రకటించారు.. వైసీపీ మాత్రం ఆ పార్టీ ప్రాపకం కోసం ప్రయత్నిస్తోంది. ఈ రెండు భిన్న దారుల వల్ల వారు తమ అవగాహనను బయట పెట్టుకోలేకపోతున్నారు. అయితే అంతర్గత సంప్రదింపుల ద్వారా ఒకే సారి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు.
తెలంగాణతో పాటే ఎన్నికలు… ఇదే గేమ్ ప్లాన్ !
కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవని చెప్పారు. ఎన్నికల సన్నాహాలు మాత్రం ఆపలేదు. పది నెలల్లో ఎన్నికలని కేసీఆర్ ప్రకటించారు. ఏపీలో వైసీపీ కూడా విడిగా ఎన్నికలకు వెళ్లడం కన్నా..కలిసి వెళ్లడమే మంచిదని భావిస్తున్నారు. పార్లమెంట్‌తో పాటు ఎన్నికలు జరిగితే పరిస్థితులు మారిపోతాయని.. అంచనా వేస్తున్నారు. అందుకే అసెంబ్లీకి విడిగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లకపోయినా ఎన్నికలు మరో ఏడాదిలో జరగాల్సి ఉంది. ఏపీలో మాత్రం ఏడాదిన్నరలో జరగాల్సి ఉంది. ఎప్పుడు జరిగినా రెండూ ఒకే సారి జరగడం మాత్రం ఖాయమనుకోవచ్చు.