ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లపై ఓ జీవో తీసుకు వచ్చింది. ఏపీలో షూటింగ్లు జరగాలి… బడ్దెట్ రెమ్యూనరేషన్లు కాకుండానే వంద కోట్లు దాటాలి వంటి లెక్కలు అందులో చెప్పింది. కానీ ఆర్ఆర్ఆర్ విషయంలో అనుమతి ఇచ్చినప్పుడు ఆ సినిమా బడ్జెట్ లెక్కలన్నీ సమర్పించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత విడుదలవుతున్న ప్రతి పెద్ద సినిమాలకు టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నారు. కానీ జీవోలో ఉన్న రూల్స్ ఏవీ ఆ సినిమాలకు వర్తించడం లేదు.
ఆచార్య కు ఏ రూల్స్ కింద పర్మిషన్ ఇచ్చారో ఎవరికీ తెలియదు. ఇదే విషయాన్ని జర్నలిస్టులు చిరంజీవిని అడిగితే.. వడ్డీలే యాభై కోట్లు కట్టుకున్నామని సీరియస్ అయ్యారు. వడ్డీలు బడ్జెట్లోకి వస్తాయో లేదో జీవోలో చెప్పలేదు అది వేరే విషయం. ఇప్పుడు మహేష్ బాబు సర్కార్ వారి పాటకు కూడా రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ సినిమా బడ్జెట్ మహేష్ రెమ్యూనరేషన్ కాకుండా రూ. అరవై కోట్లేనని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఎలా చూసినా వంద కోట్లు దాటే చాన్స్ లేదు. పైగా ఏపీలో షూటింగ్ జరగలేదు. అయినా ఎందుకు టిక్కెట్ రేట్ల పెంపునకు పర్మిషన్ ఇచ్చారు.. ఏ రూల్స్ ప్రకారం ఇచ్చారన్నది క్లారిటీ లేదు.
పెంచే ముందు ఆ సినిమా బడ్జెట్ వివరాలు ప్రభుత్వానికి సమర్పించారో లేదో తెలియదు. జగన్ పబ్లిసిటీ చేసుకున్న ఓ డైలాగ్ వాడినందుకు కృతజ్ఞతగా ఇచ్చేశారేమో తెలియదు. మొత్తంగా చూస్తే ప్రభుత్వం తాను జారీ చేసిన జీవోను తాను పట్టించుకోవడం లేదు. ఉల్లంఘిస్తోంది.ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఇష్టమైన వ్యక్తులకు ఒకలా.. వ్యతిరేకులకు మరోలా వ్యవహరిస్తోంది. ఇలా చేయడం దుష్పరిపాలనకు ఓ సాక్ష్యం అని విమర్శలొస్తున్నాయి.