ఆంధ్రప్రదేశ్‌లో 2014 కూటమి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. అయితే అప్పుడే పార్టీ పెట్టిన కారణంగా.., పవన్ కల్యాణ్ సీట్లు అడగలేదు. కానీ టీడీపీ – బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పట్లో అది సక్సెస్ ఫుల్ టీం. విడిపోవడం వల్ల టీడీపీ, జనసేన దారుణంగా దెబ్బతిన్నాయి. కానీ బీజేపీపై మాత్రం అంత ఎఫెక్ట్ పడలేదు.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమే !
జనసేనతో పొత్తు కోసం టీడీపీ ఎప్పట్నుంచో రెడీగా ఉంది. ఆ పార్టీ ఎప్పుడు ఓకే అంటుందా అని వన్ సైడ్ లవర్‌గా ఎదురు చూస్తోంది. గత ఎన్నికలకు ముందు కలసి రావాలని చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మళ్లీ పొత్తు కోసం సిద్ధమన్నారు. జనసేనతో పొత్తు పెట్టుపెట్టుకుంటే విన్నింగ్ కాంబినేషన్ అవుతుందని టీడీపీ నేతలకు గట్టి అంచనాలు ఉన్నాయి. అందుకే పవన్‌కు అండగా ఉంటున్నారు. ఏ సమస్య వచ్చినా పవన్ కోసం మాట్లాడుతున్నారు.
బీజేపీని కూడా కలుపుకోక తప్పదు !
అయితే ఈబీజేపీని కూడా కలుపుకోవాలా లేదా అన్నఅంశంపై సందిగ్ధం టీడీపీ నేతలకు ఉంది. ఆ పార్టీకి ఒక్క శాతం కూడా ఓటు బ్యాంక్ లేదు. కూటమిలో చేరితే గొంతెమ్మ కోరికలు కోరుతారు. అంతే కాదు… వారు ఆ పార్టీలో అత్యధిక మంది నేతలు అధికార పార్టీకి సన్నిహితులు. ఈ కారణంగా సొంత కూటమి ఓటమి కోసం వారు కుట్రలు పన్నుతారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఏపీ నడవాలంటే.. ఢిల్లీ ప్రభుత్వం మద్దతు అవసరం కాబట్టి.. బీజేపీని ఈ కోణంలో కలుపుకోవడానికి సిద్ధపడినా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
ఓట్లు చీలకూడదంటే అదొక్కటే మార్గం
ఏపీలో పొత్తులపై రోడ్ మ్యాప్ ఇస్తామని బీజేపీ అంటోందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అంటే..బీజేపీ, జనసేన మాత్రమే కలిసి బరిలోకి దిగే ఆలోచన లేదని అనుకోవాలి. నిజంగా ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికార వ్యతిరేక ఓటు అడ్డంగా చీలిపోతుంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో 2014 కూటమికి మాత్రమే చాయిస్ కనిపిస్తోంది. పవన్ మాటల ప్రకారం అది ఖాయమే. ఎప్పుడనేది తేలాల్సి ఉంది.