ఏపీ ప్రభుత్వంలో మూడున్నరేళ్ల పాటు సీఐడీ చీఫ్‌గా పని చేసి ఎన్నో వివాదాస్పద అరెస్టులు చేసి.. మరెన్నో వివాదాలు మూటగట్టుకున్న పీవీ సునీల్ కుమార్‌పై ప్రభుత్వమే చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఆయనపై ఖచ్చితమైన చర్యలు తీసుకుని తమకు సమాచారం ఇవ్వాలని కేంద్రం పదే పదే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. దీంతో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి .. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. డీజీ ర్యాంక్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని లేఖలో సీఎస్ ఆదేశించారు. .కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను డీజీపీకి పంపిన సీఎస్…. .యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
కేంద్రం కూడా ఇలాంటి లేఖనే సీఎస్‌కు పంపి యాక్షన్ టేకేన్ రిపోర్టును తమకు పంపాలని ఆదేశించింది. అయితే నేరుగా చర్య తీసుకునే అధికారం సీఎస్ కు ఉన్నప్పటికీ… సీఎస్.. డీజీపీకి లేఖ రాశారు. ఇప్పుడు డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికి సునీల్ కుమార్ ను బదిలీ చేశారు. ఆయన లాంగ్ లీవ్ పెట్టి అమెరికా వెళ్లిపోయారన్న ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది. యాక్షన్ తీసుకోవడం అంటే సస్పెండ్ చేయడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
పీవీ సునీల్ పై ఏపీ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్రానికి గతంలో ఫిర్యాదు చేశారు. అలాగే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు కూడా హోంశాఖకు పలు ఫిర్యాదులు చేశారు. ఇందులో హిందువులకు వ్యతిరేకంగా క్రైస్తవ మత ప్రసంగాలు చేశారనేది ప్రధాన ఫిర్యాదు. అఖిల భారత సర్వీసు అధికారి అయి ఉండి నిబంధనలకు విరుద్ధంగా ఓ మతానికి అనుకూలంగా ప్రచారం ఎలా చేస్తారనేది ఫిర్యాదు దారుల ప్రశ్న. అలాగే భార్యపై వరకట్న వేధింపులు, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామపై సీఐడీ కస్టడీలో హింస వంటి ఫిర్యాదులు కూడా పీవీ సునీల్ కుమార్ పై ఉన్నాయి.