ఓ వైపు ఆర్థిక మాంద్యం, మరో వైపు ప్రభుత్వ నిర్ణయాల మాంద్యం కలగలిపి.. ఆంధ్రప్రదేశ్‌ను పతనంలో మొదటి స్థానంలో నిలుపుతున్నాయి. మరెవ్వరూ అందుకోలేనంత దిగువలో నిలబెడుతున్నాయి. ఆదాయం పతనంలో.. ఆంధ్రప్రదేశ్..అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ – జూలై నెలల్లో ఆంధ్రప్రదేశ్ పన్నుల ఆదాయం గతంతో పోలిస్తే.. 42.7 శాతం తగ్గిపోయింది. అంటే దాదాపుగా సగానికి సగం తగ్గిపోయింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్‌తో ఏదీ సాటి రాలేదు. ఏపీ తర్వాత ఎక్కువగా ఆదాయం తగ్గిపోయిన రాష్ట్రాల్లో పంజాబ్ ఉంది. ఈ రాష్ట్రానికి తగ్గిన ఆదాయం 12.5 శాతం మాత్రమే. అంటే.. ఆంధ్రప్రదేశ్ ఆదాయం తగ్గుదలకు… పంజాబాద్ ఆదాయం తగ్గుదలకు 30 శాతం తేడా ఉంంది.
ఆర్థిక మాంద్యానికి నిర్ణయాల మాంద్యం తోడు.. !
గుజరాత్, కర్ణాటక, కేరళ కూడా.. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఆదాయం కోల్పోయాయి. అయితే.. ఈ తగ్గుదల ఏపీతో పోలిస్తే.. పది శాతానికి అటూ ఇటుగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మందగమనం, ఇతర కారణాల వల్ల.. తగ్గిపోయిన ఆర్థిక కార్యకలాపాల వల్ల ఆయా రాష్ట్రాల్లో ఆదాయం తగ్గిపోయింది. ఇది ఆ రాష్ట్ర విధానాల వల్ల వచ్చిన సమస్యలు కాదు. అందుకే.. ఇవాళ కాకపోతే.. రేపైనా పరిస్థితుల్లో కదలిక వస్తుందనే నమ్మకంతో ఉంటారు. కానీ ఏపీలో పరిస్థితి అది కాదు. ఆర్థిక మాంద్యానికి తోడు ప్రభుత్వ నిర్ణయాల మాంద్యం కూడా తోడయింది. ఏపీలో ఆర్థిక కార్యకలాపాలకు .. వాహకాలుగా ఉండే వ్యాపారాలన్నింటినీ.. ఏపీ సర్కార్ నిలిపి వేయించింది.
ఏపీలో నిలిచిన వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు …!
ప్రభుత్వం అధికారం చేపట్టగానే… ఎక్కడివక్కడ పనులు నిలిపివేయించింది. అమరావతిలో దాదాపుగా రూ. యాభై వేల కోట్ల విలువైన పనులు జరుగుతూండగా.. ఎక్కడికక్కడ.. స్టార్ వర్క్ ఆర్డర్స్ వెళ్లిపోయాయి. ఇసుక రవాణా నిషేదించడంతో.. ఏపీ వ్యాప్తంగా నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇక.. ఇతర వ్యాపారాలు… వ్యవహారాల్లో వైసీపీ నేతల పెత్తనం పెరగడంతో.. పారిశ్రామికవేత్తలు సైతం ఏపీ వైపు రావడం మావేశారు. దాంతో.. ఏపీలో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. నగదు చలామణి ఆగిపోయింది. దీంతో.. ప్రభుత్వానికి పన్ను ఆదాయం పడిపోయింది.
ఇప్పుడు తప్పు దిద్దుకున్నా .. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా..?
ప్రభుత్వానికి పన్ను ఆదాయం నలభై శాతం మేర పడిపోయిదంటే.. ప్రజలకు ఎంత మేర నష్టం వచ్చిందో… అంచనా వేయడం కష్టమేమీ కాదు. గత నాలుగు నెలల కాలంలో కూలీలు కానీ.. ఇతరులు కానీ.. కనీసం యాభై వేల కోట్లను.. నష్టపోయి ఉంటారని ఆర్థిక నిపుణుల అంచనా. నాలుగు నెలలుగా పనులు లేకపోవడం వల్ల నిర్మాణ రంగ కూలీలే.. రూ. పదిహేను వేల కోట్ల వరకూ ఆదాయాన్ని కోల్పోయారంటున్నారు. ఇక ఇతర రంగాలు, వ్యాపారాల పరిస్థితి కూడా అంతే. ఇక ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడం అంత తేలికైన విషయం కాదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.