ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నంబర్ వన్ స్థానంలో ఉంది, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే అవినీతి, ఏ చిన్న పనిజరగాలన్నాముడుపులు ముట్టజెప్పాలి.. ఇలాంటి విమర్శలు ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చేస్తున్నారు. జగన్ భాషలో చెప్పాలంటే ఇసుక నుంచి మట్టి దాకా, మట్టి నుంచి మరెక్కెడికో అంటారాయన. సరే, ఈ విమర్శల్లో ఏమాత్రం పసలేదన్నట్టుగా మరోసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. ప్రపంచబ్యాంకు, కేంద్రప్రభుత్వం సంయుక్తం ఇచ్చిన ర్యాంకింగ్స్ ఇవి.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కొంత వెనకబడి ఉన్నా, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో చూస్తున్నా… ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమస్థానం దక్కించుకోవడం గర్వించదగ్గ అంశమే. ఇతర దేశాల నుంచి పరిశ్రమలు, పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణకు ఈ ర్యాంకు ఎంతో దోహదమౌతుందనడంలో సందేహం లేదు. ఆంధ్రాకి హైదరాబాదో, లేదా బెంగళూరు లాంటి నగరం లేకపోయినా… ఇక్కడి ప్రభుత్వ విధానాలు, సమర్థ పాలన, పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహం.. ఇవన్నీ ఏపీకి ప్లస్ అవుతున్న అంశాలు. ఈ ర్యాంకుల్లో ఫీడ్ బ్యాక్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే, ఆంధ్రాలో పరిశ్రమలు పెడుతున్నవారి అభిప్రాయాల ఆధారంగా చూసుకుంటే దేశంలోనే టాప్ లెవెల్లో 86.5 శాతం స్కోరు ఏపీ సాధించింది. ఆ తరువాత, తెలంగాణ 83.95 శాతంతో తెలంగాణ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఏపీకి 98.42 శాతం, తెలంగాణకి 98.33 శాతం స్కోరు సాధించాయి. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు నంబర్ వన్, టు స్థానాల్లో పోటాపోటీగా ఉండటం విశేషం. మూడో స్థానంలో హర్యానా, నాలుగో స్థానంలో జార్ఖండ్, ఐదో స్థానంలో గుజరాత్ ఉన్నాయి.
ఆంధ్రాలో సంస్కరణల అమలు బాగుంటోందన్నది ఒకెత్తు అయితే, పారిశ్రామికవేత్తల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ లో ఏపీ నంబర్ వన్ లో ఉండటం మెచ్చుకోదగ్గ అంశమే. అంటే, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకూ, అనుమతులకూ అత్యంత అనుకూలమైన పాలన ఉంటోందన్నది ఈ ర్యాంకులు చెబుతున్న సారాంశం. దీంతో, ఇండియాలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే మొదట ఆంధ్రావైపు చూసే పరిస్థితి ఉందనడంలో సందేహం లేదు. ఏపీలో పాలనాపరంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతోపాటు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రో ఇండస్ట్రీస్ ఇమేజ్ కూడా పారిశ్రామికవేత్తల్ని ఆకర్షిస్తున్న అంశం అనడంలో సందేహం లేదు.
జనం సొమ్ముతో విదేశీ పర్యటనలు చేస్తున్నారు, విదేశాలకు వెళ్లి అవినీతి సొమ్ము దాచుతున్నారు, పాలనలో అవినీతి, పరిశ్రమల్లో అవినీతి, అనుమతుల్లో అవినీతి.. ఇలా తెల్లారి దగ్గర నుంచి టీడీపీ సర్కారును విమర్శించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు.. కనీసం ఈ ర్యాంకులు చూసైనా తగ్గాలి. లేదంటే, ప్రజల్లో మరింత చులక అయిపోతారన్నది వాస్తవం. ఒకవేళ అవినీతి ఆ స్థాయిలో ఉంటే ఇలాంటి ర్యాంకులు ఎలా వస్తాయి..?