ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో 40 శాతం మందికిజీతాలు అందలేదు. పెన్షన్లు అందలేదు. కారణం ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడమే. గత నెలాఖరులో ఆర్బీఐ నుంచి రూ. రెండు వేల కోట్లు అప్పులు చేశారు. వాటితో పాటు వచ్చిన కొంత పన్నుల ఆదాయం కలిపి జీతాలు చెల్లించడం ప్రారంభించారు. ఉన్నంత వరకూ ఇస్తూ వస్తున్నారు. అప్పటికి ఇలా ఆరో తేదీకి అరవై శాతం మందికి చెల్లించారు. ఇంకా నలభై శాతం మందికి చెల్లించాల్సి ఉంది. ఓ వైపు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. పోలవరం కోసం ఇవ్వాల్సిన రూ. రెండు వేల రెండు వందల కోట్లు అయినా ఇస్తే ఎలాగోలా సర్దుబాటు చేసుకుందామని ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు.
మరో వైపు ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు.. అప్పుల కోసం బ్యాంకర్లను సచివాలయానికి పిలిచి రాచమర్యాదలు చేసి అప్పు ప్లీజ్ అంటున్నారు. ఇలా ఎస్బీఐ క్యాప్‌ను కన్సల్టెంట్‌గా పెట్టుకుని.. కమిషన్లు ఇచ్చి.. ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి.. ప్రయత్నిస్తే.. రూ. ఆరు వేల కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇవి మంజూరు కావాలంటే సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. వాటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగారుణం వస్తుంది. అప్పుడు మిగిలిన ఉద్యోగులకు పెన్షన్, జీతాలు పంపిణీ చేస్తారు. రాను రాను ఆర్థిక పరిస్థితి భారతంగా మారుతూండటంతో ఉద్యోగులకు మూడు డీఏలు కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కొద్ది రోజుల కిందటే.. జగన్ మూడు డీఏలు ఇస్తున్నామని ప్రకటించారు. ఎప్పుడెప్పుడు అమలు చేస్తామో కూడా చెప్పారు. లాక్ డౌన్ పేరుతో కత్తిరించిన జీతం కూడా ఐదు వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో.. మూడు డీఏలు అసలు చెల్లించలేమని చేతులెత్తేశారు. నేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉద్యోగులకు పెద్ద ఎత్తున నష్టం జరగనుంది. ఉద్యోగుల తరపున మాట్లాడేవారందరూ… “సామాజిక” బాధ్యతగా ప్రభుత్వం వైపే మాట్లాడుతూండటంతో… ఉద్యోగులు అన్యాయమైపోతున్నారు.