ఒకప్పుడు మాన్యువల్ సిగ్నల్స్ ఉండేవి. అయినా ప్రమాదాలు అరుదుగా జరిగేవి. తర్వాత సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించారు. మొత్తం టెక్నికల్ గా సాగుతుంది. చివరికి రెండు రైళ్లు దగ్గరగా రాకుండా కవర్ కూడాతెచ్చామని కేంద్రం ప్రకటించింది. ఈ మధ్య కాలంలో అంటే రెండు, మూడేళ్ల కిందటి వరకూ పెద్దగా రైలు ప్రమాదం అనే మాట వినిపించేది కాదు. పట్టలు తప్పిన రైలు అనే మాట కూడా అరుదుగానే ఉండేది. కానీ ఇప్పుడు రైలు ప్రమాదాలు నిత్యకృత్యం అయిపోయాయి. ఎందుకిలా జరుగుతోంది ?
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఇంత గుడ్డిగా సిగ్నలింగ్ వ్యవస్థ ఉందా లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారా అన్న అనుమానం రాకమానదు. ఓ రైలు సమస్య వల్ల ఆగిపోతే ఆదే మార్గంలో మరో రైలు వచ్చి ఢీ కొట్టింది. ఇదేమైనా రోడ్డు మార్గమా ? ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడానికి ?. ఈ ఒక్క ప్రమాదం కాదు.. ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతన్నాయి. పది రోజుల క్రితం బీహార్లో నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. పది మందికిపైగా చనిపోయారు. అంతకు ముందు ఒడిషాలో జరిగిన ప్రమాదంలో వందల మంది చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. రైల్వే ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.
ఈ రైలు ప్రమాదాలు పెరగడానికి కేంద్రం కొత్తగా తెస్తున్న సంస్కరణలే కారణమన్న అనుమానాలు ఉన్నాయి. ప్యాసింజర్ రైళ్లు.. ఇతర రైళ్ల భద్రతా ప్రమాణాలు పడిపోయేలా వ్యవహరిస్తూ… టిక్కెట్ రేట్లు ఎక్కువగా ఉండే వందే భారత్ వంటి రైళ్లను ప్రవేశ పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ రైళ్లపై దృష్టి తగ్గించి… వాటికి కల్పించాల్సిన మౌలిక వసతులు కూడా కల్పించకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని విశ్లేషణలు వస్తున్నాయి.
గతంలో ఓ రైలు ప్రమాదం జరిగితేనే రైల్వే మంత్రి రాజీనామా చేసిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఘోరమైన ప్రమాదాలు జరిగినా సాయం చేస్తున్నట్లుగా ఫోటో షూట్లు చేసుకుంటున్నారు కానీ.,.. కనీస బాధ్యత తీసుకోవడం లేదు.