” ఆరు నెలలుగా ఇతర రాష్ట్రాల నుంచి పోలీసులు వస్తున్నారు. గంజాయి స్మగ్లర్ల గురించి ఆరా తీస్తున్నారు ” అని నర్సీపట్నం డీఎస్పీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఏపీ పోలీసులకు సమాచారం ఇస్తే.. అది స్మగ్లర్లకు చేరిపోతుందని తెలంగాణ పోలీసులు వచ్చి నేరుగా ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ కాల్పులు కూడా జరిగాయి. ఇతర రాష్ట్రాల పోలీసులు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కానీ ఇవ్వలేదని నర్సీపట్నం పోలీసులు చెప్పుకొచ్చారు. కానీ డీజీపీ మాత్రం అది మా జాయింట్ ఆపరేషన్ అని ప్రెస్మీట్లో కవర్ చేసుకున్నారు. ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్న పోలీసుల మాటలు.. చేతలు.
పొరుగు రాష్ట్రాల నుంచి అంత మంది పోలీసులు ఎందుకు వస్తున్నారు ?. ఊరకనే రారు కదా.. ఆయా రాష్ట్రాల్లో పట్టుబడుతున్న గంజాయి ఎక్కడి నుంచి వస్తుందంటే.. ఏపీ నుంచే వస్తోందని వారికి పక్కా ఆధారాలు దొరకడంతో వారంతా వస్తున్నారు. ఇటీవలి కాలంలో జాతీయ మీడియాలో హైలెట్ అయ్యేంత భారీగా అంటే.,.. వందల కేజీల్లో గంజాయి పట్టుబడింది. అది ఏపీలో కాదు. ఇతర రాష్ట్రాల్లో. ఢిల్లీ సరిహద్దు దగ్గర్నుంచి పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు వరకు ప్రభుత్వాలకు ఏపీ నుంచి వస్తున్న గంజాయే పెద్ద సమస్యగా మారింది. అందుకే వారు స్మగ్లర్లను పట్టుకోవడానికి నేరుగా నర్సీపట్నం వస్తున్నారు.
ఇటీవలి కాలంలో అంటే గత రెండు, మూడు నెలల కాలంలోనే కొన్ని వేల కేజీల గంజాయిని పట్టుకున్నారు. పట్టుకున్నదే ఇంత ఉంటే.. ఇక మార్కెట్లోకి ఎంత వెళ్లిందో ఊహించడం కష్టం. అది యువతను నిర్వీర్యం చేస్తుంది కాబట్టే ఎక్కువ ప్రభుత్వాలు సీరియస్గా తీసుకున్నాయి. ఏపీ నుంచి వచ్చే వాహనాలను ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు. ఏపీ సరిహద్దు ఉన్న రాష్ట్రాలను డీఆర్ఐ ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసింది. అంటే గంజాయి అంటే.. ఏపీ అనే బ్రాండింగ్ పడిపోయింది. ఇంత కన్నా ఏపీకి దౌర్భగ్యం ఏమీ ఉండదేమో ..?