కేంద్రం ఇచ్చిన జలరవాణా అవకాశాన్ని అందుకోలేకపోతున్న ఎపి
దేశవ్యాప్తంగా 4382 కిలోమీటర్ల జలరవాణా కు కాల్వలను అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 887 కిలో మీటర్ల కాల్వలు ఆంధ్రప్రదేశ్ లోనే వున్నాయి.
భూమితో సహా కాల్వల విస్తరణకు అవసరమైన అన్ని నిర్మాణాలపై సమగ్ర సర్వేచేయించడంలో రాష్ట్ర జలవనరుల శాఖ నుంచి పూర్తిస్ధాయి సహకారం అందడం లేదన్నది కేంద్ర వాటర్ వేస్ అధారిటీ ఫిర్యాదు.
దీనిపై ఒక కార్యాచరణను రూపొందించడానికి అధారిటీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ లో సమావేశమౌతున్నారు.
గోదావరి కృష్ణా డెల్టాలకు సాగునీరందించే పెద్దకాల్వలన్నీ ముఖ్యంగా సరుకు రవాణా మార్గాలుగా కూడా సేవలు అందించాయి. అందులో ప్రధానమైనది కాకినాడ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి మద్రాసు వరకూ వున్న బకింగ్ హామ్ కాలువ. ట్రక్కు ట్రాన్స్ పోర్టు విస్తరించడంతో సరుకు రవాణా లారీ ఎక్కింది. కాల్వలు పాడుబడ్డాయి. గట్లు ఆక్రమణలపాలయ్యాయి. 1994 లో కేంద్ర ప్రభుత్వం బకింగ్ హామ్ కాల్వ పునరుద్ధరణ పై రైట్స్ సంస్ధతో సర్వే చేయించింది. 600 కోట్ల రూపాయల ఖర్చుతో జెట్టీలు, లాకులు, వంతెనల నిర్మాణాలతో సహా కాల్వ ను నౌకాయానానికి వీలుగా అభివృద్ధి చేయవచ్చని రైట్స్ తన నివేదికలో వివరించింది.
అటకెక్కిన ఆ నివేదికను 2008 లో యుపిఎ ప్రభుత్వం బూజు దులిపింది. పద్నాలుగేళ్ళ కాలయాపనతో నిర్మాణవ్యయం అంచనా 600 కొట్ల రూపాయల నుంచి 1200 కోట్ల రూపాయలకు పెరిగింది. హైదరాబాద్, ఢిల్లీల మధ్య ఫైలు మరో ఏడేళ్ళ పాటు నత్తనడక నడవడంతో అంచనా తడిసి మోపెడైనట్టు 3500 కోట్ల రూపాయలకు పెరిగింది.
ఈ జల మార్గం పూర్తయితే, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, కొత్తపట్నం, మైపాడు, దుగరాజపట్నం, విజయవాడ, తాడేపల్లిగూడెంలో జలరవాణా టర్మినల్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ఏడాది జనవరిలో జాతీయ జల రవాణా అథారిటీ జాతీయ జలమార్గం-4ను మూడవ శ్రేణి జల మార్గంగా ప్రకటించింది. ఈ మార్గంలో వెయ్యి టన్నుల కెపాసిటీ ఉన్న స్టీమర్లు లేదా లాంచీలు ప్రయాణం చేస్తాయి. హైడ్రోగ్రాఫిక్ అధ్యయనంలో జల రవాణాకు అవసరమైన జలాల లభ్యత పుష్కలంగా ఉందని తేలింది.
బకింగ్‌హాం కెనాల్, కొమ్మమూరు కాల్వపై పూర్వం నిర్మించిన జల రవాణా కోసం నిర్మించిన లాకులను విస్తరించాల్సి ఉంటుంది. దీంతో పాటు కొమ్మమూరు కెనాల్‌ను చాలా చోట్ల వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. కొమ్మమూరు కెనాల్లో ప్రస్తుతం 50 కి.మీ. మేర జల రవాణాకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కెనాల్ నిడివి మొత్తం 112 కి.మీ జల రవాణాకు కాల్వ వెడల్పు (బెడ్ విడ్త్) 32 మీటర్లు ఉండాలని భావిస్తున్నారు. ఆ మేరకు కొమ్మమూరు కెనాల్ 50 కి.మీ. మేరకు ఉండగా, మిగిలిన 62 కి.మీను వెడల్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం అవసరమైన భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. ఇందులో భూసేకరణ ఖర్చు మాత్రమే రాష్ట్రం సమకూర్చుకుంటే చాలు మిగిలిందంతా కేంద్రమే భరిస్తుంది. కాకినాడ – పుదుచ్చేరి మధ్య జలరవాణా అందుబాటులోకి వస్తే రోడ్లపై రవాణా భారం తగ్గుతుంది. చెన్నై నుంచి కాకినాడ వరకు సరకులను జలరవాణా ద్వారా చేరవేయవచ్చు. దీంతో కాలుష్యం, ప్రమాదాలతో పాటు రోడ్లపై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
భూమి సర్వే నిమిత్తం రాష్ట్రప్రభుత్వం 3.05 కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచింది. కాకినడ నుంచి పులికాట్ సరస్సు వరకు ఈ సర్వేకు టెండర్లు పిలిచారు. కాల్వ వెంట వెడల్పు చేసేందుకు ఏ మేరకు భూములు ఉన్నాయి, ఇందులో ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు లభ్యత అనే దానిపై సర్వే చేయాలి. ఇందులో ఆక్రమణల వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. కాల్వ వెడల్పు వల్ల ఏ మేరకు ఎవరెవరు భూమిని కోల్పోతారో కూడా వివరాలను నమోదు చేయాలి. వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న భూమిని అప్పగించి మిగిలిన భూమిని భూసమీకరణ కింద లేదా భూసేకరణ కింద సేకరించాలని కేంద్రం రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది.