ఏపీలో రాజ్యాంగేతరంగా ఏర్పడిన వ్యవస్థల గురించి సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాలంటీర్లతో సాక్షి పేపర్ ను ప్రజాధనంతో కొనిపిస్తున్న అంశంపై ఈనాడు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణలో … వాలంటీర్ల ప్రస్తావన వచ్చింది. అసలు ఈ వాలంటీర్లు ఎవరని… ధర్మాసనం ఆరా తీసింది. ఈ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. తీగ లాగితే డొంక అంతా బయటపడినట్లుగా.. సాక్షి పేపర్ సర్క్యూలేషన్ ను పెంచుకునేందుకు వాలంటీర్లకు రూ. రెండు వందలు ఇచ్చేందుకు ఇచ్చిన జీవో వల్ల అసలు ఈ వాలంటీర్లు ఎవరు అనే అంశం ధర్మాసనం ముందుకు వచ్చింది. ఇక ముందు ఈ వాలంటీర్ల కేంద్రంగా అనేక రాజ్యాంగ వ్యతిరేక వ్యవస్థల గురించి బయటకు వచ్చే అవకాశం ఉంది.
వాలంటీర్లు .. గ్రామ, వార్డు సచివాలయాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అసలు వాలంటీర్లకు నెలకు రూ. ఐదు వేలు ఇచ్చి పార్టీ పనులు చేయించుకుంటున్నారు. వారంతా ప్రజాస్వామ్య విరుద్ద పనులు చేస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోవడం దగ్గర్నుంచి అధికార పార్టీకి అధికారికంగా ప్రచారం చేయడం వరకూ చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇక గ్రామ పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకు వచ్చారు. దీంతో పంచాయతీలు నిర్వీర్యం అవుతున్నాయి. ఇది అనేక ఆరోపణలకు కారణం అవుతోంది. అయినప్పటికీ.. ప్రభుత్వం తగ్గడంలేదు. వీటిపై సుప్రీంకోర్టు లేదా ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది.
ఇప్పటికే వాలంటీర్ల కేసు హైకోర్టులో విచారణలో ఉంది. కానీ రకరకాల కారణాలు చెప్పి కేసుల్నిస సాగదీస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదా ఢిల్లీ హైకోర్టులో విచారణకు వస్తే.. వాలంటీర్ల గురించి .. వారికి చెల్లిస్తున్న నిధులు.. ఇతర అంశాలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వాలంటీర్లను గుదిబండలుగా భావిస్తున్న ప్రభుత్వం గృహసారధులుగా వేరే వారిని నియమించింది. ఇప్పుడు కోర్టు కేసులు చూపించి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారేమో చూడాల్సి ఉంది.