ఏపీలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. ఓటర్ల జాబితాలో అధికార పార్టీ పడగనీడ పడిందని అందరికీ తెలుసు. టీడీపీ సానుభూతిపరులు అని తెలిస్తే చాలు ఓట్లు తొలగించడం.. దొంగ ఓట్లు నమోదు చేయడం వంటివి లెక్కలేనన్ని చేశారు. ఈ క్రమంలో ఎన్నో వివాదాలు వచ్చాయి. ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. కేసులు నమోదయ్యాయి. కానీ ఇవన్నీ తప్పని పరిస్థితుల్లోనే చేశారు. నిజంగా సీరియస్ గా చర్యలు తీసుకోవాలనుకుంటే… ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ నేతలు, అధికారులు కుమ్మక్కయిన వారిపై చర్యలు తీసుకునేవారు. ప్రతీ నియోజకవర్గంలో వాట్సాప్ గ్రూపు పెట్టుకుని మరీ ఓటర్ జాబితాల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారనేదానికి అనేక సాక్ష్యాలు బయట పడ్డాయి.
అయితే ఎఫ్ఐఆర్లు నమోదు చేయడమే తప్ప ఎప్పుడూ అలాంటి పనులు చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకోలేదు., పైగా ఏ చర్యలు ఉండవులే.. ఉత్తుత్తి కేసులే అన్నట్లుగా వ్యవహరించారు. నిజానికి తిరుపతి ఉపఎన్నికల సమయంలో వేల మంది టూరిస్టు బస్సుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేస్తూంటే ఒక్కరూ అడ్డుకోలేదు. ముఫ్ఫై వేలకుపైగా దొంగ ఓట్లు డౌన్ లోడ్ చేశారని తేలింది. ఒక్క లాగిన్ నుంచే. కానీ మిగతా అధికారుల దగ్గర నుంచి లక్షల్లో దొంగ ఓట్లు నమోదయ్యాయి. అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడు ఓటర్ జాబితాల మీద ఇంత రచ్చ జరిగి ఉండేది కాదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేసేవారు కాదు.
ఇప్పటి జాబితాలోనూ కొంత తప్పులు దిద్దే ప్రయత్నం చేసినా… దొంగ ఓటర్లు మాత్రం అలాగే ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. పర్చూరులో అత్యధికంగా ఓట్లు తొలగించారు. చంద్రగిరి, తిరుపతిల్లో అత్యధికంగా యాడ్ అయ్యాయి. ఈ వింతలు ఎలా సాధ్యమో ఎన్నికల కమిషన్ చెప్పాల్సి ఉంది. మొత్తంగా ఎన్నికల ప్రక్రియను ఓటర్ల జాబితా వద్దనే ట్యాంపర్ చేసే ప్రక్రియను అధికార వైసీపీ… యంత్రాంగాన్ని ఉపయోగించుకుని చేసింది. దీనిపై చర్యలు తీసుకోకపోతే ఇదే ఆదర్శంగా వచ్చే ప్రభుత్వాలు చెలరేగిపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ఎవరి వల్లా కాదు.